ధరణి వెబ్‌సైట్‌లో ప్రభుత్వ భూఖాతాలు

కలెక్టర్‌ సర్ఫరాజ్‌ అహ్మద్‌
కరీంనగర్‌,ఫిబ్రవరి14(జ‌నంసాక్షి): ప్రభుత్వ భూఖాతాలను ధరణి వైబ్‌ సైట్‌లో మార్క్‌ చేయాలని కలెక్టర్‌ సర్ఫరాజ్‌  అహ్మద్‌ అధికారులను ఆదేశించారు.  పట్టాదారు చనిపోతే వారి వారసుల పేరిట వెంటనే మ్యుటేషన్‌ చేయాలన్నారు. రైతులు భూములు అమ్మినా, కొనుగోలు చేసినా అట్టి భూమిని రికార్డుల్లో నిక్షిప్తం చేయాలన్నారు. గ్రామాల వారీ గా భూ సమస్యల కేసులను తయారు చేయాలని కలెక్టర్‌ తహాసీల్దార్లను ఆదేశించారు. పెండింగ్‌లో ఉన్న డిజిటల్‌ సంతకాలను వెంటనే చేయాలని తహసీల్దార్లను కలెక్టర్‌ ఆదేశించారు. ప్రతి రైతుకూ పట్టాదారు పాసు పుస్తకాలు పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. కోర్టు కేసుల్లేని భూములకు సంబంధించిన పాసు పుస్తకాలను తక్షణమే బాధ్యులకు అం దజేయాలని తహసీల్దార్లకు సూచించారు.జిల్లాలో 51వేల రైతు ఖాతాలకు ఆధార్‌ అనుసంధానం లేదని, వెంటనే అనుసంధానించాలని కలెక్టర్‌ ఆదేశించారు. గ్రామాల్లో భూ సమస్యలపై ఆర్‌ఐ, వీఆర్‌ఓను పంపించి విచారణ జరిపించాలని ఆదేశించారు. సాదా బైనామాల కేసులను వెంటనే పరిష్కరించాలని, భూమిని ప్రస్తుతం ఎవరి ఆధీనంలో ఉందో తెలుసుకుని గ్రామంలో విచారించి న్యాయబద్దంగా తహసీల్దార్లు వెంటనే తుది నిర్ణయం తీసుకుని అర్హులైన రైతులకు భూమిని 1బీలో నమోదు చేసి పట్టా పాసు పుస్తకాలు జారీ చేయాలని ఆదేశించారు.