ధరల అదుపులో ప్రభుత్వాల విఫలం

 

దాహమేసినప్పుడే బావి తవ్వుకున్న చందాన సర్కార్‌ వైఖరి ఉంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నేలవిడిచ సాము చేస్తున్నాయి. ఓట్లు రాబట్టే పథకాలకు పదను పెడుతున్నాయి తప్ప ప్రజలకు అవసరమైన విధంగా నిర్ణయాలు తీసుకోవడంలో విఫలం అవుతున్నారు. రైతులను ఆదుకునే విధంగా పంటలను దేశ అవసరాల మేరకు సేంద్రియ పద్దతుల్లో పండించే కార్యాచరణ చేయడం లేదు. దీంతో నిత్యావసర వస్తువుల కొరత ఏర్పడుతోంది. ప్రధానంగా పప్పులు దొరక్కపోవడంతో బ్లాక్‌ మార్కెటీర్లు లాభాలు పండించుకుంటున్నారు. ఓ వైపు వేసవి తాపంతో జనం విలవిలాడిపోతుంటే, మరొక పక్క మార్కెట్లో పప్పుల ధరలను చూసి వడదెబ్బకు గురవుతున్నారు. ఎండల మాదిరిగా ధరలు మండిపోతుండటంతో వినియోగదారులు సతమతవుతున్నారు.  నియంత్రణ లేని దిశలో పప్పుల ధరలు పెరుగుతూ వస్తున్నాయి. ఏ రోజూ నిలకడ ధర లేదు.  ముఖ్యంగా మినపప్పు ధర బాగా పెరిగింది. కేజీ మినపప్పు రూ.120 నుంచి నెమ్మదిగా రూ.130 వరకు వెళ్లింది. ఇపుడు రూ.175లు అయి కుర్చుంది. ఇంకా మంచి రకం మినపప్పు కావాలని అడిగితే కేజీ రూ.180 నుంచి 190లు వరకు చెబుతున్నారు. శనగ పప్పు, కంది పప్పు, వేపిన శనగపప్పుల ధరలు కూడా బాగా పెరిగిపోయాయి. చాలా మంది తమ కిరాణా సామాన్ల జాబితాలో ఈ నెల పప్పులను తొలగించేస్తున్నారు.  మార్కెట్లో బ్లాక్‌ దందాను అరికట్టలేకపోతున్నారు. అక్రమ నిల్వలను వెలికితీయలేక పోతున్నారు. తూతూ మంత్రంగా దాడలు చేస్తున్నా పెద్దగా ఫలితం లేకుండా పోతోంది. ఆహార ధాన్యాల ఎగుమతులకు కళ్లెం వేయాలన్న ముందు చూపూ లేక పోయింది. ఇక అడ్డూ అదుపు లేకుండా బ్లాక్‌ మార్కెట్‌ సాగించే అక్రమార్కుల జోలికి వెళ్లే తెగువనూ ప్రదర్శించ లేకపోయింది.  కందిపప్పుతో పాటు మిగిలిన అన్ని పప్పులూ, నిత్యావసరాల ధరలూ గత రెండేళ్లుగా  అందనంతగా పెరుగుతున్నా సకాలంలో చర్యలు తీసుకోవాలన్న కనీస ధర్మాన్ని  కూడా పాలకులు పట్టించుకోవడం లేదు. నిజానికి కందిపప్పు ధర ఆకాశానికి ఎగబాకడం ఊహించనిదేవిూ కాదు. కొంత కాలంగా ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాల కారణంగా దేశ వ్యాప్తంగా అపరాల సాగు గణనీయంగా తగ్గిపోయింది. ప్రతి ఏడాది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విడుదల చేస్తున్న గణాంకాలే ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. దీనికి తోడు దేశవ్యాప్తంగా నెలకొన్న అనావృష్టి పరిస్థితులూ సమస్యను తీవ్రం చేశాయి. వర్షాభావ పరిస్థితులు ఇదే మాదిరి కొనసాగితే రానున్న రోజుల్లో కొరత తప్పదంటూ ఆహారరంగ నిపుణులు కొన్ని నెలలుగా చేస్తున్న హెచ్చరికలనూ ప్రభుత్వం బేఖాతరు చేసింది. దీంతో నిత్యావసర వస్తువుల ధరలు ప్రజానీకానికి శరాఘాతంలా తాకుతున్నా ప్రభుత్వాలకు చీమ కుట్టినట్టు కూడా లేకపోవడం దారుణం.  ధరలు ఇష్టం వచ్చినట్లు పెరగడంతో నెలవారీ బడ్జెట్‌ తలకిందులు అవుతోందని మధ్యతరగతి ప్రజానీకం గగ్గోలు పెడుతున్నారు. ఇదే ధరలు కొనసాగితే  సంసారాలు నడిచేదెలా అని వాపోతున్నారు. ధరల నియంత్రణలో ప్రబుత్వాలుచేతులు ఎత్తేసినట్లు కనిపిస్తోంది. ఇక ధరల పెరుగుదల కారనంగా  తినుబండారాల తయారీదారులు, ¬టల్స్‌ నిర్వాహకులు ఆందోళన చెందుతున్నారు.  పప్పుల ధరలు బాగా మండిపోతున్నాయింటూ మాంసాహారులు చికెన్‌ కొనుగోలు చేసేందుకు వెళితే అక్కడ అదే పరిస్థితి. మొన్నటి వరకు కేజీ చికెన్‌ రూ.120 నుంచి రూ.160 వరకు పెరుగుతూ వచ్చింది. తాజాగా అది కాస్తా రూ.200లకి ఎగబాకింది. అన్ని ధరలు ఒకేసారి మండిపోతుండటంతో ఓ పక్క ఉక్కపోత.. మరో పక్క ధరల మోతతో ప్రజలు అల్లాడిపోతున్నారు.  పంచదార ధర కూడా బాగా పెంచేశారు. కేజీ పంచదార రూ.33లు నుంచి రూ.38లకు వెళ్లింది. ఇక నూనె సైతం పెరిగింది. 15 కేజీల నూనె డబ్బా వద్ద రూ.75లు పెరిగినట్లు వ్యాపారులు చెబుతున్నారు. ధరలు పెరగడానికి కారణం మాత్రం  తెలియదంటున్నారు. ధరలు ఇలా పెంచుకుంటూ పోతున్న దశలో విద్యార్థులకు నాణ్యమైన భోజనం పెట్టమంటే ఎలా అని మధ్యాహ్న భోజన నిర్వాహకులు, హాస్టల్‌ నిర్వాహకులు అంటున్నారు.  పప్పు చారుతో ప్రస్తుతం ఉన్న ధరలతో భోజనాలు ఎలా పెట్టగలం?, డబ్బులు కూడా సకాలంలో ఇవ్వరు. ధరలు చూస్తే ఆకాశాన్ని అంటుతున్నాయి. మా అప్పులు కూడా అలానే పైకి వెళ్తున్నాయి. ధరల నియంత్రణపై ప్రభుత్వానికి స్పష్టమైన ఆలోచన లేక ఈ విధమైన ఇబ్బందులు వస్తున్నాయి. ఇలా ధరలు పెరుగుతూ ఉంటే సామాన్యుల  పరిస్థితేంటో అర్థం కావడం లేదు. ధరలు సామాన్యులకు చుక్కలు  చూపిస్తున్నా,పప్పుల ధరలు మండిపోతున్నా ప్రభుత్వాల్లో చలనం కానరావడం లేదు. దేనికీ కరవును బూచిగా చూపుతున్నారు. మొన్నటి వరకు ఉల్లి మంటపుట్టిస్తే ఇప్పుడు పప్పులు మంట పెడుతున్నాయి. దేశ వ్యాప్త పరిణామాల్లో భాగంగానే కంది సాగు తగ్గింది. ఏడాది క్రితం దాదాపుగా 85 రూపాయలున్న కందిపప్పు ప్రస్తుతం 200 రూపాయలు దాటినా చలనం లేదు. ఉల్లిధరలు ఇంకా 20కి చేరువలోనే ఉన్నాయి. ప్రజలు బాధలకు అలవాటు పడడంతో పాలకులు కూడా పట్టించుకోవడం లేదు. వారి ప్రాధామ్యాల్లో ధరల పెరుగుదల లేకుండాపోయింది. ఈ దుస్థితి నుండి ప్రజలను బయట పడేయాల్సిన పాలక వర్గాలు పట్టించుకోకుండా, మార్కెట్‌ శక్తుల లాభాల రక్షణకే ప్రాధాన్యమిస్తున్న తీరు దుర్మార్గం కాక మరోటి కాదు.