ధర్నా విరమించారు!

– గవర్నర్‌తో చర్చల అనంతరం ధర్నా విరమించిన పుదుచ్చేరి సీఎం
– డిమాండ్లు పాక్షికంగా నెరవేరాయని వెల్లడి
పుదుచ్చేరి, ఫిబ్రవరి19(జ‌నంసాక్షి) : పుదుచ్చేరి సీఎం నారాయణస్వామి ధర్నా విరమించారు. గత కొద్ది
రోజలుగా లెఫ్టినెంట్‌ గవర్నర్‌ కిరణ్‌బేడీ తీరును వ్యతిరేకిస్తూ రాజ్‌నివాస్‌ ఎదుట ధర్నా చేపట్టిన విషయం విధితమే. గవర్నర్‌తో సోమవారం రాత్రి పొద్దుపోయేంతవరకూ సాగిన చర్చల అనంతరం సీఎం ఈ నిర్ణయం తీసుకున్నారు. తమ డిమాండ్లు పాక్షికంగా నెరవేరాయని అందుకే ధర్నా విరమించినట్లు ఆయన తెలిపారు.
‘లెఫ్టినెంట్‌ గవర్నర్‌ కిరణ్‌బేడీతో జరిపిన చర్చల అనంతరం మా ఆందోళనలను విరమించుకున్నామని, ఫిబ్రవరి 20,21న పిలుపునిచ్చిన జైల్‌ భరో, నిరాహార దీక్షను రద్దు చేశామని తెలిపారు. లెఫ్టినెంట్‌ గవర్నర్‌తో జరిగిన సమావేశంలో మా డిమాండ్లను కొంతవరకు సాధించగలిగామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం పంపిన ప్రతిపాదనల్లో కొన్నింటిని లెఫ్టినెంట్‌ గవర్నర్‌ ఆమోదించారని సీఎం నారాయణస్వామి తెలిపారు. అయితే పుదుచ్చేరికి రాష్ట్ర ¬దాపై తమ ఆందోళన కొనసాగుతుందని ఆయన పేర్కొన్నారు. ప్రజల కోసం తీసుకొచ్చిన సంక్షేమ పథకాలను లెఫ్టినెంట్‌ గవర్నర్‌ కిరణ్‌బేడీ ఆమోదించట్లేదని, ఆమెను వెంటనే రీకాల్‌ చేయాలని డిమాండ్‌ చేస్తూ గతవారం నారాయణస్వామి ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే. కిరణ్‌బేడీ నివాసమైన రాజ్‌నివాస్‌ ముందు రోడ్డుపై బైఠాయించి ధర్నా చేపట్టారు. ఈ ధర్నాకు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజీవ్రాల్‌ మద్దతిచ్చారు. సోమవారం పుదుచ్చేరి చేరుకున్న కేజీవ్రాల్‌.. నారాయణస్వామిని కలిసి తన మద్దతు తెలియజేశారు. కాగా సోమవారం రాత్రి గవర్నర్‌ చర్చలకు ఆహ్వానించడంతో సుమారు నాలుగు గంటల పాటు వీరి మధ్య చర్చలు సాగాయి.