ధర్మసాగర్‌కు తోడు మల్కాపూర్‌ రిజర్వాయర్‌

మారనున్న పూర్వ ఓరుగల్లు ముఖచిత్రం

నీటి కొరత తీరి పెరగనున్న భూగర్భజలాలు

జనగామ,ఫిబ్రవరి5(జ‌నంసాక్షి): మల్కాపూర్‌ గ్రామంలో రిజర్వాయర్‌ ఏర్పాటుతో వరంగల్‌ టౌన్‌ తోపాటు జనగామ ప్రాంతానికి కూడా నీటి కరువు తీరనుంది. ఇప్పటికే నీరు అందిస్తున్న ధర్మసాగర్‌కు తోడు మల్కాపూర్‌ రిజర్వాయర్‌ నిర్మాణం జరిగితే పూర్వ వరంగల్‌ జిల్లాలో తాగునీటికి కొరత ఉండదని అంటున్నారు. దేవాదుల విస్తరణలో భాగంగా స్టేషన్‌ఘన్‌పూర్‌ నియోజకవర్గ పరిధి చిలుపూరు మండలంలోని మల్కాపూర్‌ చెరువును రిజర్వాయర్‌గా మార్చేందుకు సిఎం కెసిఆర్‌ అంగీకరించారు. ఈమేరకు పనులు కూడా సాగనున్నాయి. అలాగే ఈ ప్రాంతంలో చెరువులకు మహర్దశ పట్టనుంది. దీంతో వ్యవసాయానికి, తాగునీ సమస్యకు శాశ్వత పరిష్కారం దక్కగలదని అంటున్నారు. 10 టీఎంసీల సామర్థ్యం గల రిజర్వాయర్‌ను నిర్మించడంతో వరంగల్‌ పట్టణానికి శాశ్వత నీటి సమస్య తీరనుంది. మాజీ ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి చొరవ కారణంగానే మల్కాపూర్‌ రిజర్వాయర్‌ తెరపైకి వచ్చింది. దీంతో వరంగల్‌,హన్మకొండ పట్టణాలకు భవిష్యతులో ఉపయోగంగా వుంటుందని అన్నారు. సీఎం కేసీఆర్‌ ఆమోదం తెలుపడం పట్ల నియోజకవర్గ ప్రజలు అనందాన్ని వ్యక్తం చేశారు. తెలంగాణ జిల్లాలో రెండవ అతిపెద్ద రిజర్వాయర్‌గా ఏర్పాటు కావడం సంతోషదాయకమన్నారు. జిల్లాలోనే అన్ని రిజర్వాయర్‌ల కంటే ఇదే పెద్ద రిజర్వాయర్‌ కావడంతో 3నియోజకవర్గల్లోని చెరువులు జలాశయాలుగా మారనున్నాయి. కడియం చిరకాల కోరికైన మల్కాపూర్‌ రిజర్వాయర్‌కు కేబినెట్‌ ఆమోదం తెలుపడంతో కడియం శ్రీహరి కల నేరవేరింది. గతంలో ఈ ప్రాంత ప్రజలు తాగు,సాగు నీటి వసతులు సరిగా లేక పోవడాన్ని ప్రత్యక్షంగా గమనించిన కడియం రిజార్వయర్‌ను సాధించి ప్రజల ఆకాంక్షలను నెరవేర్చారు. దేవాదుల ప్రాజెక్టుకే ధర్మసాగర్‌ రిజర్వాయర్‌ తలమానికంగా ఉంది. ఈ ప్రాజెక్టులో భాగంగా ధర్మసాగర్‌ రిజర్వాయర్‌ ఒక జంక్షన్‌గా అధికారులు దీనిని వాడుకుంటున్నారు. ఇక్కడి నుంచి స్టేషన్‌ ఘన్‌పూర్‌, గండిరామారం రిజర్వాయర్‌తోపాటు పైన ఉన్న రిజర్వాయర్లుకు ఇక్కడి నుంచే పంపింగ్‌ చేస్తుంటారు. కాకతీయుల కాలంలో ఈ చెరువు నుంచి హన్మకొండలోని పబ్లిక్‌గార్డెన్‌కు మొదటగా కాల్వ ద్వారా నీటిని సరఫరా చేసి అక్కడి గార్డెన్‌కు నీరు అందించిన చరిత్ర ఉంది. నాటి నుంచి వరంగల్‌ నగరానికి తాగునీటిని సరఫరా చేసేందుకు రెండోదఫా పైపులైన్‌ ఏర్పాటు చేసి పూర్తిగా గ్రావిటి ద్వారానే నగర ప్రజలకు తాగునీటిని సరఫరా చేస్తున్నారు. వరంగల్‌ అర్బన్‌ జిల్లాకు ధర్మసాగర్‌ చెరువు అతిదగ్గరలో ఉంది. దశాబ్దకాలం క్రితం చెరువును దేవాదుల ప్రాజెక్టు కింద రిజర్వాయర్‌గా మార్చారు. నాటి నుంచి ఇచ్చటికీ వివిధ ప్రాంతాల నుంచి పర్యాటకులు వస్తుంటారు. చెరువుకు మధ్యలో అతి పెద్ద కొండ కట్టకు చివరన మరొకొండ ప్రత్యేక ఆకర్షణగా ఉంది. పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా రిజర్వాయర్‌లో తెప్పెల పోటీలను నిర్వహించి దీని ప్రాధాన్యతను చాటారు. రిజర్వాయర్‌ చుట్టూ పచ్చని పొలాలు, గోదావరి జలాలు ఇక్కడ ప్రత్యేకం. మల్కాపూర్‌ రిజర్వాయర్‌తో ఇక ధర్మసాగర్‌, కూడా పర్యాటక కేంద్రాలుగా మారనున్నాయి. ధర్మసాగర్‌ రిజర్వాయర్‌ ఎకో టూరిజంగా రూపుదిద్దుకోనుంది. ఇందుకు నాటి అర్బన్‌ జిల్లా కలెక్టర్‌ ఆమ్రపాలి ధర్మసాగర్‌ చెరువులో ఎకో టూరిజం బోటింగ్‌ యూనిట్‌ ఏర్పాటుకు సమగ్ర నివేదిక రూపొందించాలని ఆదేశించారు. టూరిజం ఏర్పాటు కోసం బోటింగ్‌, బండింగ్‌, అడ్వెంచర్‌ గేమింగ్‌, వాచ్‌ టవర్‌ వంటి వాటిని ఏర్పాటు చేసేందుకు అవకాశం ఉందని వివరించారు. జిల్లా కేం ద్రానికి సవిూపంలో, హైదరాబాద్‌ హైవే నుంచి రిజర్వాయర్‌ వరకు ఎనిమిది కిలోవిూటర్లు ఉండడం వల్ల పర్యాటకులు వస్తుంటారని ఒక అంచనాకు వచ్చారు.