ధవళేశ్వరం వద్ద గోదావరికి.. 

పెరిగిన వరద ఉధృతి
– 9.31అడుగులకు చేరిన నీటిమట్టం
–  175గేట్లు ఎత్తి 3.30లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల
కాకినాడ, జులై12(జ‌నం సాక్షి) : భారీ వర్షాలకు ఎగువ నుంచి వస్తున్న ప్రవాహంతో తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం బ్యారేజీ వద్ద గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. ప్రస్తుతం నీటి మట్టం 9.31అడుగులకు పెరిగింది. దీంతో బ్యారేజీ వద్ద 175 గేట్లను ఎత్తివేసి 3.30లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేశారు. విలీన మండలాల్లో భారీ స్థాయిలో వర్షాలు కురవడంతో శబరి నది పొంగి ప్రవహిస్తోంది. శబరి నది నుంచి గోదావరిలోకి వరద నీరు వచ్చి చేరడంతో క్రమక్రమంగా నీటి మట్టం పెరుగుతోంది. గురువారం సాయంత్రానికి వరద ఉధృతి మరింత పెరిగే అవకాశం ఉందని ఇరిగేషన్‌ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు వచ్చిన నీటి వచ్చినట్టుగానే సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. భారీ వర్షాలతో సాయంత్రానికి ఐదు లక్షల క్యూసెక్కుల నీటి సముద్రంలోకి విడుదల చేస్తామని అధికారులు చెబుతున్నారు. భారీ వర్షాలతో కోనసీమలో చాలా ప్రాంతాల్లో నారుమడులు నీట మునిగాయి. వర్షాలతో చెరువులు నిండుకుండలా ప్రవహిస్తున్న నేపథ్యంలో సాగుకు అనుకూలంగా ఉంటుందని మెట్టప్రాంత రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలతో పాటు తూర్పుగోదావరి జిల్లాలో భారీ వర్షాలు పడుతుండటంతో గోదారమ్మ పొంగి ప్రవహిస్తోంది.