ధాన్యం కొనుగోళ్లపై నిఘా

రైతుకు నష్టం జరక్కుండా చర్యలు
జనగామ,నవంబర్‌14 (జనంసాక్షి)  : ధాన్యం కొనుగోళ్లలో ఎలాంటి అక్రమాలు జరుగకుండా జిల్లా యంత్రాంగం నిఘా ముమ్మరం చేసింది. కలెక్టర్‌, జేసీ ఆదేశాల మేరకు రెవెన్యూ అధికారులు కొనుగోలు కేంద్రాలను పరిశీలించి కొనుగోళ్లపై ఆరా తీస్తున్నారు. రైతుల ధాన్యం తప్ప, వ్యాపారుల పేర బస్తా కొనుగోలు చేసినా చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. కొనుగోలు కేంద్రం నిర్వాహకులు గతంలో వ్యాపారులతో కుమ్మక్కై రైతుల పేరిట ట్రక్కు షీట్లు రాయించి మద్దతు ధర పొందినట్లు ఆరోపణలు ఉన్నాయి. లైసెన్స్‌లు లేని వ్యాపారులు ఇష్టానుసారంగా కొనుగోళ్లు చేపట్టకుండా చెక్‌ పెట్టేందుకు, రైతన్నకు మద్దతు ధర దక్కేలా అధికారులు పర్యవేక్షిస్తున్నారు. జిల్లా కలెక్టర్‌ ఆదేశాలతో అధికారులు కేంద్రాలను పరిశీలించి రైతులు ఇబ్బందులు పడకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. నిర్వాహకులు అవకతవకలకు పాల్పడితే చర్యలు తప్పవని కలెక్టర్‌ హెచ్చరించారు. రైతులు ఆరుగాలం కష్టించి పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించేందుకు తెలంగాణ సర్కార్‌ ప్రత్యేక కృషి చేస్తోంది.  మద్దతు ధర నిర్ణయించి జిల్లా వ్యాప్తంగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి అన్నదాతకు అండగా నిలుస్తోంది. దీంతో రైతులు నేరుగా కొనుగోలు కేంద్రాలకే ధాన్యం తరలిస్తున్నారు. ఇందుకుగాను ప్రభుత్వం జనగామ జిల్లాలోని 13 మండలాల్లో ఐకేపీ , ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలు నెలకొల్పి మద్దతు ధర అందిస్తోంది. దీంతో ఐకేపీ, ప్రాథమిక వ్యవసాయ సహకారం సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్లు జోరందుకున్నాయి. రైతులు దళారులను ఆశ్రయించకుండా నేరుగా కొనుగోలు కేంద్రాలకే ధాన్యం తరలించే విధంగా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. గతంలో ఎక్కువ మొత్తంలో ధాన్యం దిగుబడి వచ్చిన నేపథ్యంలో ఈసారి సైతం వస్తుందనే అంచనాతో రైతులకు మరిన్ని సేవలు అందించాలన్న సంకల్పంతో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు.  కాంటాలు వేసిన వారం పది రోజుల్లో డబ్బులు అందించేలా చర్యలు తీసుకుంటున్నట్లు మండల స్థాయి అధికారులు వెల్లడిస్తున్నారు. ధాన్యంలో 18 శాతం తేమ మించకుండా ఉండేలా రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. కేంద్రాలకు వచ్చిన ధాన్యం ఎప్పటికప్పుడు కొనుగోలు చేస్తున్నారు. అలాగే  రైతుల ఖాతాల్లో డబ్బులు సకాలంలో జమ అయ్యేలా చర్యలు చేపడుతున్నారు.