ధోనీకి మాజీ కెప్టెన్‌ కపిల్‌ దేవ్‌ మద్దతు

ఆతని అనుభవం జట్టుకు ఇప్పుడు ఎంతో అవసరం

న్యూఢిల్లీ,నవంబర్‌19(జ‌నంసాక్షి): టీమిండియా మాజీ సారథి మహేంద్రసింగ్‌ ధోనీకి మాజీ కెప్టెన్‌ కపిల్‌ దేవ్‌ మద్దతుగా నిలిచాడు. ధోనీ ఫామ్‌లో లేడంటూ వస్తున్న విమర్శలపై స్పందించాడు. ధోనీ మునిపటిలా ఆడడం లేదని అనడంలో అర్థం లేదన్నాడు. అతడేవిూ ఇంకా ఇరవైయ్యేళ్ల కుర్రాడు కాదని, అప్పటి ఆటను అతడి నుంచి ఆశించవద్దని సూచించాడు. కుర్రాడిగా ఉన్నప్పుడు జట్టుకు ధోనీ ఎన్ని సేవలు అందించాడో అందరికీ తెలుసని పేర్కొన్న కపిల్‌ అతడి అనుభవం జట్టుకు ఇప్పుడు ఎంతో అవసరమన్నాడు. టీమిండియాకు దొరికిన అంత్యంత విలువైన ఆస్తి ధోనీ అని పేర్కొన్నాడు. జట్టు క్లిష్ట సమయాల్లో ఉన్నప్పుడు సమయస్ఫూర్తితో ఆదుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయని కపిల్‌ గుర్తు చేశాడు. ప్రస్తుతం భారత జట్టులో మంచి ఆటగాళ్లు ఉన్నారని కపిల్‌ పేర్కొన్నాడు. దీనిని సద్వినియోగం చేసుకోగలిగితే విదేశాల్లో భారత జట్టు అద్భుతాలు చేస్తుందన్నాడు. టీమిండియా ప్రస్తుత సారథి విరాట్‌ కోహ్లీ గురించి మాట్లాడుతూ అతడో ప్రత్యేకమైన వ్యక్తి అని ప్రశంసించాడు. కష్టపడి ఆడే స్వభావం అతడి సొంతమని కొనియాడాడు.