నకిలీ విత్తనాలపై కొరడా

అప్రమత్తం అయిన జిల్లా అధికార యంత్రాంగం
విత్తన వికేత్రల సమాచారం సేకరణ
రైతులకు విత్తనాలపై ముందస్తు అవగాహన
ఆదిలాబాద్‌,మే20(జ‌నంసాక్షి): ఆదిలాబాద్‌లో నకిలీ విత్తనాలతో రైతులు మోసపోకుండా జిల్లా అధికార యంత్రాంగం పిడికిలి బిగించింది. గతంలో జరిగిన ఘటనలు దృష్టిలో పెట్టుకుని రైతులను అప్రమతంలం చేస్తున్నారు,. ఓ వైపు కలెక్టర్‌ దివ్యాదేవరాజ్‌, మరోవైపు ఎస్పీ విష్ణువారియర్‌లు చర్యలకు ఉపక్రమించారు. నకిలీ విత్తానాలు అమ్మే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు. మరోవైపు రైతులకు పంటల సాగుపై అవగాహన కల్పిస్తూ నాసిరకం విత్తనాలపై అప్రమత్తం చేయాలని అధికారులను కలెక్టర్‌ దివ్యదేవరాజన్‌ ఆదేశించారు. నాసిరకం విత్తనాలు అరికట్టడంలో రెవెన్యూ, పోలీస్‌, వ్యవసాయ శాఖల అధికారులు ఏకకాలంలో జిల్లాలో దాడులు నిర్వహించాలని సూచించారు. విత్తనాలు విత్తక ముందే రైతులకు పంటల సాగుపై తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలియజేయడానికి కరపత్రాలు, షార్ట్‌ ఫిలీంలను రూపొందించా లన్నారు. టాస్క్‌ఫోర్స్‌ టీం జిల్లా, మండల కేంద్రాల్లో సీడ్స్‌ షాపులపై ఆకస్మికంగా దాడులు జరపాలన్నారు. అనుమతి లేని కంపెనీల విత్తనాలు పట్టుబడితే వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వానాకాలం సీజన్‌ సవిూస్తున్న తరుణంలో వివిధ కంపెనీలు రైతులకు మాయమాటలు చెప్పి మోసాలకు పాల్పడే అవకాశం ఉందన్నారు. ప్రభుత్వ గుర్తింపు పొందిన కంపెనీల విత్తనాలలే కొనుగోలు చేయాలని రైతులకు సూచించాలన్నారు. గుర్తింపు లేని విత్తనాలు మార్కెట్‌లో వచ్చినట్లు ఆరోపణలు వస్తున్నాయన్నారు. వివిధ జిల్లాల్లో అక్కడక్కడ అధికారుల దాడుల్లో పట్టుబడిన సంఘటనలు ఉన్నాయని గుర్తు చేశారు. జిల్లాలో ఇలాంటి విత్తనాలను విక్రయించకుండా మూడు శాఖల అధికారులు సమన్వయంతో పని చేసి అరికట్టాలన్నారు. మరోవైపు నాసిరకం విత్తనాలపై నిఘా కొనసాగిస్తున్నామని, వాటిని అరికట్టేందుకు ప్రత్యేక పోలీసు టాస్క్‌ఫోర్స్‌ టీమ్‌ను ఏర్పాటు చేశామని ఎస్పీ విష్ణువారియర్‌ వెల్లడించారు.  వానాకాలం సీజన్‌ సవిూపిస్తుండడంతో వ్యాపారులు నాసిరకం విత్తనాలు, నిషేధిత బీటీ-3, పత్తి విత్తనాలను మార్కెట్‌లో, గ్రామస్థాయిలో విక్రయించడానికి ఆస్కారం ఉంటుందని పేర్కొన్నారు. వీటిని అరికట్టేందుకు ముందస్తుగానే పోలీసు శాఖను అప్రమత్తం చేశామని తెలిపారు. అవసరమైన చోట ఆకస్మిక దాడులు నిర్వహించి కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశామని చెప్పారు. మహారాష్ట్ర సరిహద్దు గుండా, రైలు మార్గంలో నాసిరకం విత్తనాలను ముందుగానే తెప్పించుకొని జిల్లాలో నిల్వ చేయడానికి అక్రమార్కులు ప్రయత్నిస్తుంటారని పేర్కొన్నారు. అక్రమార్కులు ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రవేశించి గ్రామాల్లో నేరుగా రైతులకు మాయమాటలు చెప్పి, తక్కువ ధర పేర ఎరవేసి విక్రయిస్తారని తెలిపారు. ఈ సమయంలో మరింత అప్రమత్తంగా ఉండి పకడ్బందీగా నిరోధించడానికి ప్రత్యేక టీమ్‌ను ఏర్పాటు చేశామన్నారు. లైసెన్స్‌ లేని వ్యాపారస్తులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించామన్నారు. గ్రామాల వారీగా ప్రజలకు నాసిరకం విత్తనాలపై అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తామన్నారు. ఇన్‌స్పెక్టర్‌ ఆధ్వర్యంలో ఇద్దరు ఎస్సైలు పది మంది కానిస్టేబుళ్లతో ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటు చేసి జిల్లావ్యాప్తంగా అన్ని మండలాల్లో ఆకస్మిక తనిఖీలు చేపడతారన్నారు. వీరికి ప్రత్యేక నిఘా పోలీసు అధికారుల సహకారం ఉంటుందని తెలిపారు. వ్యవసాయ శాఖ అధికారులను పోలీసు టాస్క్‌ఫోర్స్‌ బృందంలో చేర్చుకోవాలని నిర్ణయించామని చెప్పారు. రైతులు లైసెన్స్‌ ఉన్న వ్యాపారుల వద్ద కొనుగోలు చేసి తప్పనిసరి రసీదు తీసుకోవాలని ఎస్పీ కోరారు.