నకిలీ విత్తన రైతులకు దక్కని హావిూ

వరంగల్‌,ఫిబ్రవరి25(జ‌నంసాక్షి): లక్కీ మిరప విత్తనాలు..నేడు జీవా కంపెనీ మిరప విత్తనాలు రైతులను నిండా ముంచాయి. ఈ విత్తనాలు మొలకెత్తక పోవడంతో ఇప్పుడు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. వీటిని విక్రయించిన వారిపై చర్య తీసుకోవాలని రైతాంగం కదం తొక్కినా లాభం లేకుండా పోయింది. ఇక వారికి పరిహారం కూడా వస్తుందన్న నమ్మకం కూడా లేకుండా పోయింది.  నారుపోసిన రోజు నుంచి ఇప్పటిదాకా ఎకరాకు రూ.50 వేల చొప్పున పెట్టుబడి పెట్టామని  రైతులు తెలిపారు. పంట కొల్పోయిన తమకు ఎకరాకు రూ.70 వేల చొప్పున పరిహారం చెల్లించి నకిలీ విత్తనాలను విక్రయించిన కంపెనీ మూసేసి, విక్రయించిన వ్యాపారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్‌ చేశారు. లక్కీ విత్తనాలతో పంటలు దెబ్బతిని తీవ్రంగా నష్టపోయిన రైతాంగం రోడ్డుపైకి వచ్చి జరిపిన ఆందోళనలు అన్నదాతలు మరచిపోకముందే జీవా కంపెనీకి చెందిన నకిలీ మిరప విత్తనాలు వెలుగులోకి రావడంతో రైతుల్లో ఆందోళన నెలకొంది. జీవా కంపెనీ మిరప విత్తనాలు తమను తీవ్రంగా నష్టపరిచాయని ఆరోపిస్తూ పలువురు రైతులు నర్సంపేటలో ఇటీవల ఆందోళనకు దిగారు. మంచి దిగుబడి వస్తుందని తమకు జీవా కంపెనీకి చెందిన విత్తనాలను ప్యాకెట్‌కు రూ.350 చొప్పున తమకు అంటగట్టాడని పలువురు రైతులు ఆరోపించారు. విత్తనాలు
నారు పోసి తోటలు నాటి నాలుగు నెలలైనా ఇంత వరకు ఎలాంటి ఎదుగుదల లేదని వాపోయారు. జీవా విత్తనాలు నకిలీవి కావడంతో పూత, కాత రావడం లేదని పత్రికల్లో కథనాలు వస్తున్నాయని వ్యాపారికి
చెప్పినా ఏమాత్రం పట్టించుకోకుండా నిర్లక్ష్యం వహించాడని ఆరోపించారు.ఆ మేరకు ఆకంపెనీ విత్తనాలను సాగు చేసిన చెన్నారావుపేట మండలం కోనాపురం, ఎల్లాయిగూడెం, జల్లి గ్రామాలకు చెందిన పలువురు రైతులు కాత, పూతలేని మిరప మొక్కలను తీసుకొని ప్రదర్శన చేశారు.