నడిరోడ్డుపై నోట్ల వర్షం!

– కార్లు దిగి మరీ ఏరుకున్న స్థానికులు
– అమెరికాలోని ఈస్ట్‌ రూథర్‌ పోర్డ్‌ రహదారిపై ఘటన
న్యూజెర్సీ, డిసెంబర్‌17(జ‌నంసాక్షి) : నడిరోడ్డుపై నోట్ల వర్షం కురిస్తే ఎవరు ఊరుకుంటారు చెప్పండి.. వెంటనే వాటిని దక్కించుకొనేందుకు పోటీపడతారు.. చడీచప్పుడు కాకుండా వాటిని దక్కించుకొని అక్కడి నుండి జారుకుంటారు.. ఇలాంటి సంఘటన ఒకటి అమెరికాలోని ఈస్ట్‌ రూథర్‌ ఫోర్డ్‌ రహదారిపై ఈ ఘటన చోటు చేసుకుంది..  వివరాల్లోకి వెళితే.. అమెరికాలోని న్యూజెర్సీ ప్రాంతంలో ఉదయం 8గంటల 30 నిమిషాలు కావస్తుంది. ఎవరి పనిలో వారు బిజీగా ఉన్నారు. ఆఫీసులకు, పనుల విూద వెళ్లే వారితో ఈస్ట్‌ రూథర్‌ ఫోర్డ్‌ రహదారి బిజీగా ఉంది. రోడ్డుపై వాహనాలు వాయువేగంతో దూసుకెళుతున్నాయి. ఇంతలో ఓ ఘటన చోటు చేసుకుంది. భారీ నగదుతో వెళుతున్న ఓ ట్రక్‌ లో నుంచి డబ్బులు రోడ్డుపై పడిపోయాయి. దీంతో ఒక్కసారిగా ట్రాఫిక్‌ మొత్తం ఆగిపోయింది. వాహనదారులు తమ కార్లను పక్కకు ఆపి రోడ్డుపై పడ్డ
డబ్బులను ఏరుకునేందుకు పోటీ పడ్డారు. అక్షరాలా.. రూ. 2.15 కోట్లు క్షణాల్లో మాయమైపోయింది. విషయం తెలుసుకున్న వెంటనే పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. ట్రక్‌ తలుపులు సరిగా బిగించకపోవడంతో ఈ ఘటన జరిగిందన్నారు. దారిలో ఒక తలుపు తెరుచుకుని డబ్బు రోడ్డుపై పడిపోయాయని తెలిపారు. డబ్బును తీసుకున్న వారిని గుర్తించి తగిన చర్యలు తీసుకుంటామని పోలీసులు వివరించారు.