నదుల అనుసంధానంపై కదలని కేంద్రం

నదుల అనుసంధానంతోనే జలసమస్యలు తీరుతాయన్న ప్రకటనలకు అనుగుణంగా కార్యాచరణ జరగలేదు. నాలుగేళ్లుగా నదుల అనుసందానం విషయంలో అడుగు ముందుకు పడలేదు. అలాగే అంతర్‌ రాష్ట్ర జలవివాదాలు సమిసి పోలేదు. తమిళనాడు-కర్నాటకల మధ్య కావేరీ వివాదం అలాగే కొనసాగుతోంది. తాజాగా ఎపి, తెలంగాణల మధ్య కృష్ణా వివాదం ముదురుతోంది. దీనికితోడు నీటి విడుదలలో కర్నాటక మడతపేచీలు పెడుతోంది. ఈ దశలో కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ప్రకటించిన అనుసంధానం అడుగు కూడా ముందుకు పడలేదు. కృష్ణా జలాలు తెలుగు రాష్ట్రాల్లోకి రాకుండా పైన కర్నాటక ఆల్మట్టి, నారాయణపూర్‌ నిర్మించింది. దీంతో నీటి కష్టాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు శాపంగా మారాయి. భారీ వర్షాలు పడి, కర్నాటక ప్రాజెక్టులు నిండితే తప్ప నీరు రాని దుస్తితి ఏర్పడింది. దీంతో శ్రీశైలం, సాగర్‌ ప్రాజెక్టులు వట్టిపోయేలా ఉన్నాయి. ఎగువ రాష్ట్రాల తీరు కారణంగా ఎపిలో గోదావరి, పెన్నాల అనుసంధానాన్ని యుద్ధప్రాతిపదికన చేపట్టాలని సిఎం చంద్రబాబు భావిస్తున్నారు. కృష్ణా పరివాహక ప్రాంతంలోని ఆల్మట్టి, నారాయణపూర్‌, ఉజ్జయిని, జూరాలలు నిండాకే కిందకు వస్తున్నాయి. దీంతో గోదావరిలో ఎగువనుంచి కాకుండా దిగువన నీటి లభ్యత ఉంటోంది. ఇదే ఎపికి వరంగా మారింది. పట్టిసీమతో ఈ ప్రయత్నం విజయవంతం చేశారు. పెన్నాతో అనుసంధానం కూడా పూర్తయితే ఇక సమస్యలు రావు. క్షేత్రస్తాయిలో జరగుతున్న ఈ పనులను పరిశీలించి రైతాంగానికి ఇరు రాష్ట్రాల్లో విపక్షాలు బాసటగా నిలవాలే తప్ప వ్యతిరేకించడం ద్వారా ప్రయోజనాలకు గండికొట్టవద్దు. ఈ పరిస్థితుల్లో తెలంగాణ,ఎపిల్లో ప్రభుత్వాలు సొంతంగానే ప్రాజెక్టులతో భవిష్యత్‌ వ్యూహాన్ని ఖరారు చేసుకుని సాగుతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న నీటి సంరక్షణ, మళ్లింపు లేదా ఎత్తిపోతల పథకాలు భవిష్యత్‌ వ్యవసాయ, తాగునీటి అవసరాలను తీర్చేలా ఉన్నాయి. ఇరు రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు తమ శక్తివంచన లేకుండా సాగునీటి కోసం పడుతున్న తపనను అభినందించాల్సిందే. వీరు తీసుకుంటున్న చర్యలు లేదా కార్యాచరణ కారణంగా సాగునీటి రంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం కానుందనడంలో సందేహం లేదు. తెలంగాణలో కాళేశ్వరం, మల్లన్న సాగర్‌, కొండపోచమ్మ, శ్రీరాంసాగర్‌ ప్రాజెక్ట్‌ పునరుద్దరణ పనులు, సీతారామ సాగర్‌ ప్రాజెక్టు పనులు శరవవేంగంగా పూర్తవుతున్నాయి. కోటి ఎకరాల మాగాణమే తెలంగాణ లక్ష్యంగా నీటి ప్రాజెక్టుల నిర్మాణం శరవేగంగా సాగుతున్నాయి. ఇప్పటికీ సీతారామ ప్రాజెక్ట్‌ ద్వారా కృష్ణానీటిని అందివ్వడం ద్వారా తెలంగాణ ప్రభుత్వం తన చిత్తశుద్దిని చాటుకుంది. మిషన్‌ కాకతీయ ద్వారా చెరువుల పునరుద్దరణ జరిగింది. ఇదంతా కంటికి కనిపిస్తున్న దృశ్యాలు. నిజానికి తెలంగాణ లేదా ఎపిల్లో జరుగుతున్న ప్రాజెక్టులకు సంబంధించి రాజకీయాలను పక్కన పెట్టి చూస్తే రైతాంగం అవసరాలు తీరుతాయని గుర్తించవచ్చు. ఎపిలో కూడా పట్టిసీమ,పురుషోత్తమపట్నం,ముచ్చుమర్రి ప్రాజెక్టులు పూర్తి చేయడం ద్వారా నీటిని మళ్లించే పథకాలను విజయవంతం చేశారు. కృష్ణాడెల్టా వాసులకు గోదావరి నీటిని పట్టిసీమ ద్వారా అందించి బహుశా గతంలో ఎన్నడూ లేనివిధంగా నీటి కొరతను తీర్చారు. డెల్టాకు భరోసా కల్పించారు. ఇదో అద్భుత పథకంగానే చూడాలి. బీళ్లు బారిన తెలంగాణ భూములను సస్యశ్యామలం చేయాలన్న సంకల్పంతో, గొంతెండుతున్న జనం కష్టాలను తీర్చాలన్న సంకల్పంతో ప్రారంభించిన పథకాలు మిషన్‌ కాకతీయ, మిషన్‌ భగీరథ. ఈ పథకాల్లో అధికారపార్టీ ఎమ్మెల్యేలు ఉన్న నియోజక వర్గాలకు వచ్చే నిధులకు సమానంగా ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాలకు అందుతు న్నాయి. అంతటా ఒకేవిధమైన అభివృద్ధి సాగుతుంది. అంతటా గొలుసుకట్టు చెరువులన్నీ వరుసకట్టి

అలుగుపోస్తున్నాయి. వివిధ పథకాలు సమర్థవంతంగా అమలుచేయడానికి ఎలాంటి చర్యలైనా తీసుకునే అధికారం, స్వేచ్ఛను జిల్లా కలెక్టర్లకు సీఎం కెసిఆర్‌ అందించారు. పట్టిసీమ ద్వారా గోదావరి జలాలలను కృష్ణాకు మళ్లించి దానిని సాకారం చేసింది. పట్టిసీమ, పురుషోత్తమ పట్నం, చింతలపూడి ఎత్తిపోతలను తక్కువ చేసి చూడరాదు. అలాగే రాజకీయ విమర్శలతో అడ్డుకోరాదు. తాజాగా రాయలసీమ జిల్లాలకు వరంగా మారనున్న ముచ్చుమర్రి ప్రాజెను కూడా అందుబాటులోకి తీసుకుని వచ్చారు. శ్రీశైలం బ్యాక్‌ వాటర్‌ ద్వారా కృష్ణా జలాలను సీమకు మళ్లించే బృహత్తర పథకంగా దీనిని చెప్పుకోవాలి. కర్నూలు జిల్లాలోని ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం రెండోదశ పథకాన్ని చంద్రబాబు జాతికి అంకితం చేశారు. ప్రస్తుతం రెండోదశ కింద హంద్రీనీవాకు మూడు పంపుల ద్వారా నీటిని విడుదల చేశారు. ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం ద్వారా కెసి కెనాల్‌కు, హంద్రీనీవా సుజల స్రవంతికి కష్టకాలంలో నీరందించొచ్చని తెలిపారు. రాయలసీమ జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులకు పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్‌ ద్వారా నీరందించాలంటే శ్రీశైలం డ్యామ్‌లో 854 అడుగుల నీటిమట్టం ఉండాలని, మల్యాల నుంచి హంద్రీనీవాకు నీటిని తోడాలంటే 834 అడుగులు ఉంటేనే సాధ్యమవుతుంది. ఈ దశలో ముచ్చుమర్రి ద్వారా శ్రీశైలం డ్యామ్‌లో 798 అడుగులున్నా నీటిని తోడుకోవచ్చని గుర్తించి ఈ పథకాన్ని తీసుకుని వచ్చారు. దీంతో సీమలోని నాలుగు జిల్లాలకు కృష్ఱానీటిని పంపింగ్‌ చేసే అవకాశం ఏర్పడింది. దీనిని మరింత విస్తృతపరుస్తామని, మరో నాలుగు పంపులు పెట్టి రాయలసీమ జిల్లాల్లోని వెలుగోడు రిజర్వాయర్‌, గండికోట, బ్రహ్మం సాగర్‌, గోరుకల్లు, అవుకు, చిత్రావతి రిజర్వాయర్లను అనుసంధానం చేస్తామని చంద్రబాబు ప్రకటించారు.