నమో నామస్మరణకు తగ్గిన ఆదరణ

ప్రచారాంశాల్లో కానరాని ఆకర్శణ
ప్రచారంలో ఇద్దరు నేతలే ముందుంటున్న వైనం
ఎన్నికల ప్రచారంలో కానరాని బిజెపి సీనియర్లు
ఫలితాలపై అప్పుడే బిజెపి నేతల్లో బెంగ?
న్యూఢిల్లీ,మే3(జ‌నంసాక్షి): లోక్‌సభ ఎన్నికలు తుది అంకానికి చేరుకుంటున్నాయి. ఇప్పటికే నాలుగు విడతల ఎన్నికలు ముగిశాయి. ఈ నెల19తో మిగతా అంకం కూడా పూర్తి కానుంది. గత లోక్‌సభ ఎన్నికలతో పోల్చు కుంటే బిజెపికి గానీ, మోడీకి గానీ ఈ ఎన్నికలు అంత సులవుగా లేవన్న విషయం అర్థం అయివుంటుంది. అందుకే మోడీ,అమిత్‌షాలు కాలుకు బలపం పట్టుకుని ఊరూవాడా ప్రచారంలో మునిగారు. నమో నామస్మరణ గాని, ఆయన ఆర్భాటాలు గాని అక్కరకు రాని దురవస్థ ఇప్పుడు కనపిస్తోంది. తన సర్కారు మేడిపండు నిర్వాకాలు, నిరంకుశాలు తెలుసు గనకనే మోదీ సరిగ్గా ఎన్నికల బ్జడెట్‌లో రైతులకు సహాయ పథకాలు ప్రవేశపెట్టి గ్టటెక్కాలనుకున్నారు. అదీ పేలని బాంబుగా మారింది.  నోట్లరద్దు, జిఎస్టీ ఫలితాల ప్రభావం ప్రజలకు నేరుగా తాకింది. వారిని రోడ్డున పడేసింది. అందుకే ప్రజల్లో నమో పట్ల అంతగా ఆకర్శణ కానరావడం లేదు. వారు చేస్తున్న ప్రచారం ఒక వ్యూహం ప్రకారం జరుగు తున్నట్టు అందరికీ
అర్థమైపోవడంతో మోదీ షా జోడీ ఇరకాటంలో పడింది. మరోసారి అయోధ్య సమస్యను పైకి తీసి రామ రాజకీయం జరపాలని చూసినా, ఈ ఐదేళ్లు ఏం చేశారని ప్రజల్లో ప్రశ్నలు వస్తున్నాయి. కాంగ్రెస్‌ హయాం లో కుంభకోణాల గురించి మాట్లాడితే రాఫెల్‌ భూతం ముందుకొచ్చి నిలదీసింది. టెర్రరిజంపై తామే ఎక్కువ పోరాటం చేశామని చెబుదామంటే ఉరి, పుల్వామా వంటి ఘటనలు ఎందుకు నిరోధించలేక పోయారని ప్రశ్నిస్తున్నారు. నెహ్రూ గాంధీ కుటుంబ పాలన అనేది ప్రధాన నినాదంగా తీసుకున్నా పెద్దగా ప్రయోజనం కానరావడం లేదు.ఇబిసి రిజర్వేషన్ల మంత్రంతో అగ్రవర్ణాలను సంతృప్తి పర్చాలనుకున్నా పెద్దగా ప్రయోజనం కానరావడం లేదు.  మోదీ వేయాలనుకున్న అస్త్రాలన్నీ శక్తి విహీనంగా తయార య్యాయి. ప్రత్యేక ¬దా హావిూ ఏపీలో విశ్వాసాన్ని వమ్ము చేసింది. కర్ణాటకలో యెడ్యూరప్ప వ్యవహరాలు అప్రదిష్ట తెచ్చిపెట్టాయి. తమిళనాడులో పళని ప్రభుత్వాన్ని ఒత్తిడిచేసి పొత్తు పెట్టుకున్నా డిఎంకె కూటమిదే పైచేయిగా మారింది.  ఇలా ఉత్తర దక్షిణ భారతాల్లో ఉక్కిరిబిక్కిరి అవుతున్న బిజెపి నేతలకు ప్రచారంలో ప్రధాన అస్త్రాలు కానరావడం లేదు.  బెంగాల్‌ వెళ్లి తనతో 40 మంది తృణమూల్‌ ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారని ఫిరాయింపు రాగం వినిపించారు.మోదీ మాటలపై ఎన్ని ఫిర్యాదులు వచ్చినా వాటిని తాపీగా పరిశీలించి చివరకు తప్పులేదని కితాబులివ్వడం ఇసికి రివాజుగా మారింది. గతంలో సోనియా గాంధీ ఇటాలియన్‌ అన్నవారు ఇప్పుడు రాహుల్‌ జాతీయతపై వివాదం పెట్టేందుకు అయిదేళ్ల కిందట సుబ్రమణ్య స్వామి చేసిన ఫిర్యాదును తవ్వితీశారు.అయిదేళ్ల పాలన గురించి ఘనంగా చెప్పుకోవడం గానీ భవిష్యత్తు గురించి ఒక ఆశాజనకమైన దృక్పథం ఆవిష్కరించడం గానీ మోదీ ప్రచారంలో కానరావడం లేదు. గత ఎన్నికల ముందు గుజరాత్‌ ఫార్ములా అంటూ నరేంద్రమోడీ అనూహ్యంగా తెరపైకి వచ్చారు. ఆయనే ఈ దేశానికి సరైన నాయకుడని భావించారు. బిజెపి నేతలు కూడా అద్వానీ లాంటి సీనియర్ల మనోభావాలను తెలుసుకోకుండా, ఆయనతో సంప్రదించకుండా మోడీని తెరపైకి తెప్పించారు. నిజానికి నరేంద్ర మోదీకి లభించినంతటి అద్భుత అవకాశం ఈ దేశంలో మరెవరికీ దక్కలేదు. దేశ ప్రజలంతా ఆయనపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. దేశం దశాదిశా మారుస్తారని నమ్మకం పెట్టుకున్నారు. ఐదేగేళ్లు గడిచేసరికి ప్రజల్లో భ్రమలు తొలగిపోవడం మొదలయ్యింది. ఆయనవల్ల దేశానికి లాభం మాట దేవుడెరుగు ..ప్రజలకు భారంగా మారాన్నడ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అయినా ఆయన తనపై వస్తున్న విమర్శలపై ఆత్మవిమర్శ చేసుకోవడం లేదు. అందుకే ఎన్నికల ప్రచారంలో పెద్దగా ప్రభావం కానరావడం లేదు. దీంతో అప్పుడే ఫలితాలపై ఆందోళన కనిపిస్తోంది.