నయీం ఎన్‌కౌంటర్‌పై అసెంబ్లీలో చర్చ

nayeem1హైదరాబాద్: గత రెండున్న దశాబ్దాలుగా నయీ ముఠా అనేక అరాచకాలకు పాల్పడిందని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. సోమవారం అసెంబ్లీలో నయీం ఎన్‌కౌంటర్‌పై చర్చను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ గత ప్రభుత్వాల హయాంలో నయీం యదేచ్ఛగా నేరచర్యలు కొనసాగించారన్నారు. తాము అధికారంలోకి వచ్చాక నయీం కదలికలపై నిఘా ఉంచామన్నారు. ఈ క్రమంలో గత ఆగస్టు 8న నయీం ముఠా మిలీనియం టౌన్‌షిప్‌లో మారణాయుధాలతో సంచరిస్తుండగా పోలీసులకు సమాచారం అందిందన్నారు. వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని నయీం అరెస్ట్‌కు ప్రయత్నించారని…ఆ సందర్భంగా జరిగిన ఎదురుకాల్పుల్లో నయీం హతమయ్యాడన్నారు.
నయీం దందాలపై ప్రభుత్వం సిట్‌ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. నయీం అరాచకాలపై 174 కేసులు నమోదయ్యాయని చెప్పారు. ఇప్పటివరకు 124మంది నిందితులు అరెస్టయ్యారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నయీం ముఠాకు చెందిన స్థావరాల్లో పోలీసులు జరిపిన సోదాల్లో 21 తుపాకులు, 25 కార్లు, 26 బైక్‌లు స్వాధీనం చేసుకున్నారని, అలాగే నయీం కబ్జాలో ఉన్న 1000 ఎకరాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఇప్పటివరకు 37 ఇళ్లను స్వాధీనం చేసుకున్నామని కేసీఆర్ వెల్లడించారు. నయీం ఎన్‌కౌంటర్‌తో ప్రజలు ఊపిరిపీల్చుకున్నారన్న సీఎం నయీం విషయంలో పోలీసుల సమర్థతను అభినందించారు. రాష్ట్రంలో అరాచక శక్తులను అణచివేస్తామని సీఎం కేసీఆర్‌ స్పష్టం చేశారు.