నల్గొండ ఎంపీగా పోటీ చేస్తా

– కాంగ్రెస్‌ సీనియర్‌ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి

నల్గొండ, ఫిబ్రవరి7(జ‌నంసాక్షి) : త్వరలో నల్గొండ ఎంపీగా పోటీచేస్తానని మాజీ మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ప్రకటించారు. ఇటీవల పంచాయతీ ఎన్నికల్లో గెలుపొందిన కాంగ్రెస్‌ సర్పంచ్‌, ఉపసర్పంచ్‌, వార్డు మెంబర్ల అభినందన సభ గురువారం జరిగింది. ఈ షభలో కోమటిరెడ్డి పాల్గొని మాట్లాడారు. నల్గొండ నుంచి తనను ఎంపీగా గెలిపించే బాధ్యత విూదేనని సూచించారు. సర్పంచ్‌గా ఓడిపోయిన వారు మనోధైర్యం కోల్పోవద్దన్నారు. అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. ప్రభుత్వం గ్రామజ్యోతి పథకాన్ని ప్రవేశపెట్టి నిధులు మాత్రం ఇవ్వలేదని ఆరోపించారు. అంతేకాకుండా కేంద్రం నుంచి గ్రామాలకు వచ్చే నిధులను కూడా పక్కదోవ పట్టించారని విమర్శించారు. ఈసారైనా ప్రభుత్వం నిధులు కేటాయించి గ్రామాలను అభివృద్ధి చేయాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటై రెండు నెలలు కావస్తున్నా నేటికీ మంత్రి వర్గాన్ని ఏర్పాటు చేయకపోవటం సిగ్గుచేటన్నారు. రెండు నెలలుగా రాష్ట్రంలో పాలన పడకేసిందని, ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయన్నారు. ప్రభుత్వం సమస్యలను పరిష్కరించాల్సి పోయి నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుందని విమర్శించారు. కేసీఆర్‌కు ప్రజల బాగోగులకంటే పార్లమెంట్‌ ఎన్నికల్లో ఎక్కువ సీట్లు సాధించటమే ముఖ్యమన్నట్లుగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు కేసీఆర్‌ తీరును గమనిస్తున్నారని, పార్లమెంట్‌ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.