నల్గొండ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ భర్త  శ్రీనివాస్‌ దారుణ హత్య

– అర్థరాత్రి హత్యచేసి కాల్వలో పడేసిన దుండగులు
– కోమటిరెడ్డికి ముఖ్య వర్గీయునిగా ఉంటూ వస్తున్న శ్రీనివాస్‌
– శ్రీనివాస్‌ మృతదేహం వద్ద కన్నీరుమున్నీరైన కోమటిరెడ్డి
– కుటుంబ సభ్యులను ఓదార్చిన ఎమ్మెల్యే
– శ్రీనివాస్‌ది రాజకీయ హత్యే
– పార్టీ మారాలని బెదిరింపులకు గురిచేశారు
– ఈ కుట్రలో పోలీసుల ప్రమేయం కూడా ఉంది – కోటిరెడ్డి ఆగ్రహం
– నల్గొండ పట్టణ బంద్‌కు పిలుపునిచ్చిన కాంగ్రెస్‌
– ప్రభుత్వం తీరుకు నిరసనగా ఆందోళనలు నిర్వహించిన కాంగ్రెస్‌ కార్యకర్తలు
– ఏడుగురు అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్న పోలీసులు
నల్గొండ, జనవరి25(జ‌నంసాక్షి) : నల్గొండ పురపాలిక ఛైర్‌ పర్సన్‌ భర్త బొడ్డుపల్లి శ్రీనివాస్‌ దారుణ హత్యకు గురయ్యాడు. బుధవారం అర్థరాత్రి దాటిన తరువాత సావర్కర్‌ నగర్‌ లోని ఆయన ఇంటి వద్ద  గుర్తు తెలియని దుండగులు బండ రాయితో మోది  ఘాతుకానికి పాల్పడ్డారు. మురుగు కాల్వలో మృతదేహం పడి ఉండటాన్ని గుర్తించిన కొందరు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రిలోని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. సంఘటనాస్థలాన్ని జిల్లా ఎస్పీ పరిశీలించి వివరాలు సేకరించారు. హత్యకు గురైన శ్రీనివాస్‌… శాసనసభ్యుడు కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి అనుచరుడు.  కోమటిరెడ్డితో కలసి నిన్న తిప్పర్తి మండలంలో పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు.  బుధవారం రాత్రి శ్రీనివాస్‌ నివాసం ఉంటున్న సావర్కర్‌ నగర్‌లో రాత్రి 11 గంటల సమయంలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు గొడవ పడ్డారు. ఈవిషయంలో స్థానిక కౌన్సిలర్‌ కుమారుడు మెరగు గోపి సర్దిచెప్పే ప్రయత్నం చేసినట్లు సమాచారం. అయినా గొడవ సద్దుమనకపోవడంతో గోపీ, శ్రీనివాస్‌కు ఫోన్‌ చేసి విషయం చెప్పాడు. దీంతో బయటకు వచ్చిన శ్రీనివాస్‌ వారికి నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. అయితే ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య మాటకుమాట పెరగటంతో శ్రీనివాస్‌ను హత్య చేసి మురికి కాలువలో పడేసినట్లు భావిస్తున్నారు. హత్య అనంతరం నిందితులు నేరుగా పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయారు. శ్రీనివాస్‌ హత్యపై ఎటువంటి అల్లర్లు జరగకుండా పోలీసులు ముందస్తు చర్యలు తీసుకున్నారు.
ఇది ముమ్మాటికీ రాజకీయ హత్యే – ఎమ్మెల్యే కోమటిరెడ్డి
శ్రీనివాస్‌ మృతి కాంగ్రెస్‌ పార్టీకి, తనకు తీరని లోటు అని ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. శ్రీనివాస్‌ హత్య విషయం తెలిసిన వెంటనే అక్కడకు చేరుకున్న కోమటిరెడ్డి ఘటనాస్థలిని పరిశీలించారు. శ్రీనివాస్‌ కుటుంబసభ్యులను ఓదార్చారు. శ్రీనివాస్‌ మృతదేహాన్ని చూసిన వెంటనే కోమటిరెడ్డి బోరున విలపించారు. శ్రీనివాస్‌ మృతిపై కోమటిరెడ్డి మాట్లాడుతూ.. నేరుగా ఎదుర్కొనే దమ్ము లేకనే దొంగచాటుగా కుట్ర పన్ని శ్రీనివాస్‌ ప్రాణం తీశారని మండిపడ్డారు. ఒంటరిగా చేసి చంపడం పిరికిపందల చర్య అని పేర్కొన్నారు. 2016 ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలోనే తనకు, తన అనుచరులకు ప్రాణహాని ఉందని ప్రభుత్వానికి ఫిర్యాదు చేశామని, అయినా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఏమాత్రం  పట్టించుకోలేదని కోమటిరెడ్డి విమర్శించారు. గ్యాంగ్‌స్టర్‌ నయీమ్‌ మనుషులు నాలుగుసార్లు తుపాకీతో
బెదిరించారని, భద్రత కల్పించాలని సీఎం కేసీఆర్‌ను కోరినా స్పందించలేదని ఆరోపించారు. రాష్ట్రంలో నేతల ప్రాణానికే భద్రత లేకుండాపోతోందని, ఇక సామాన్యుడి పరిస్థితి ఏంటని ఆయన ప్రశ్నించారు. సమాజంలో శాంతి భద్రతలను కాపాడాల్సిన పోలీసులు అధికార నేతలకు కొమ్ముకాస్తున్నారని మండిపడ్డారు. స్థానిక డీఎస్పీ అధికార పక్షానికి వత్తాసు పలుకుతూ, టీఆర్‌ఎస్‌ నేతల రౌడీయిజాన్ని పెంచి పోషిస్తున్నారని, శ్రీనివాస్‌ హత్యలో డీఎస్పీ పాత్ర ఉందని కోమటిరెడ్డి ఆరోపించారు. కేసు  విచారణకు ప్రత్యేక విచారణ కమిటీ వేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. హత్య వెనుక పెద్ద రాజకీయ నాయకుల హస్తం ఉందనే అనుమానం వ్యక్తం చేశారు. తనకు శ్రీనివాస్‌ లోని లోటు తీర్చలేనిదన్నారు. హత్యకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వం శ్రీనివాస్‌ కుటుంబానికి తగిన న్యాయం, పరిహారం అందించాలని కోమటిరెడ్డి డిమాండ్‌ చేశారు.అనంతరం నల్గొండ గడియారం కూడలిలో ప్రధాన రహదారిపై బైఠాయించారు. కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలంతా ధర్నాలో పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం మోటార్‌ సైకిళ్లతో ర్యాలీ నిర్వహించారు.
పోలీసుల అదుపులో అనుమానితులు..
కొడ్డుపల్లి శ్రీనివాస్‌ హత్యపై పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు జరుపుతున్నారు. ఇప్పటికే ఐదుగురు వ్యక్తుల్ని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. హత్య అనంతరం లొంగిపోయిన వారిలో కత్తల చక్రి, దుర్గయ్య, మాతంగి, మోహన్‌, గోపి ఉన్నారు. మరో ముగ్గురు రాంబాబు, మల్లేష్‌, శరత్‌లు పరారీలో ఉన్నారు. వీరికోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. బజ్జీల బండి వ్యవహారమే ఘటనకు ప్రధాన కారణమన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిన్న రాత్రి 11 గంటల సమయంలో… బజ్జీల బండి నిర్వాహకుడితో పాటు మరో కౌన్సిలర్‌ సహా అయిదుగురు వ్యక్తులు… శ్రీనివాస్‌ ఇంటికి వచ్చినట్లు సమాచారం. బజ్జీల బండి నిర్వాహకుడికి, మరో వ్యక్తికి మధ్య భేదాభిప్రాయాలు ఏర్పడగా వారిద్దరూ స్థానిక కౌన్సిలర్‌ను ఆశ్రయించారు. కౌన్సిలర్‌ వద్ద సమస్య పరిష్కారం కాకపోవడంతో ఆయన సూచనలతోనే బొడ్డుపల్లి శ్రీనివాస్‌ ఇంటికి వెళ్లి ఆయనకు జరిగిన ఘటనను వివరించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య మాటామాటా పెరిగి తోపులాటకు తద్వారా ఘర్షణకు దారితీసినట్లు అక్కడివారు అనుమానిస్తున్నారు. ఇందులో మరో కోణాన్ని కూడా జోడిస్తున్నారు. ఇరువర్గాల మధ్య సయోధ్యకు శ్రీనివాస్‌ యత్నిస్తుండగానే… అనుకోకుండా కొందరు వ్యక్తులు వచ్చి దాడికి పాల్పడ్డారన్న వాదనలూ వినపడుతున్నాయి. అయితే ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్న వ్యక్తులతో పాటు ప్రధాన నిందితులు దొరికితే పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశముంది.
పోలీసుల నిర్లక్ష్యంతోనే తన భర్తను కోల్పోయా- చైర్‌పర్సన్‌ లక్ష్మీ
శ్రీనివాస్‌ భార్య, నల్గొండ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ లక్ష్మిని జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు, జాయింట్‌ కలెక్టర్‌ నారాయణ రెడ్డి పరామర్శించారు. అనంతరం విూడియాతో మాట్లాడిన లక్ష్మి పోలీసుల తీరుపై మండిపడ్డారు. రాత్రి ఫోన్‌ రాగానే శ్రీనివాస్‌ బయటకు వెళ్లారని, కాసేపటికే హత్య జరిగిందన్న విషయం తెలిసిందన్నారు. శ్రీనివాస్‌కు ప్రాణహాని ఉందని చెప్పినా ప్రభుత్వం పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. గన్‌ లైసెన్స్‌ ఇవ్వమని అడిగినా పోలీసులు స్పందించలేదని అన్నారు. తమ అభ్యర్థనలను పోలీసులు ఏమాత్రం పట్టించుకోలేదని విమర్శించారు. పోలీసులు నిర్లక్ష్యం కారణంగానే భర్తను పోగొట్టుకున్నానని లక్ష్మి రోదించారు.-