నవ్విపోదురు గాక.. ఓటుకు వ్యాక్సిన్‌..

 

– బీహార్‌ ఓటర్లకు భాజపా బంపర్‌ ఆఫర్‌

– బీహార్‌ ఎన్నికల మ్యానిఫెస్టో విడుదల చేసిన నిర్మలా సీతారామన్‌

న్యూఢిల్లీ,అక్టోబరు 22(జనంసాక్షి):విూకు కరోనా వ్యాక్సిన్‌ ఉచితం..అయితే మా కూటమిని గెలపించండని బిజెపి తన ఎన్నికల మ్యానిఫెస్టో విడుదల చేసింది. బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో.. కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌ గురువారం బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు. బీహార్‌ రాష్ట్ర ప్రజలు రాజకీయంగా చాలా సున్నితంగా ఉంటారని, వారికి రాజకీయ పరిజ్ఞానం కూడా ఎక్కువే అన్నారు. పార్టీలు చేసే వాగ్దాలను వారు అర్థం చేసుకుంటారని ఆమె అన్నారు. ఎన్‌డీఏ ప్రభుత్వం హయంలో.. బీహార్‌లో జీడీపీ బాగా పెరిగిందన్నారు. 3 శాతం నుంచి 11.3 శాతానికి గత 15 ఏళ్ల ఎన్డీఏ పాలనలో పెరిగినట్లు ఆమె వెల్లడించారు. ప్రజలకు సుపరిపాలన అందించడం వల్లే ఇది సాధ్యమైందన్నారు. కోవిడ్‌ వ్యాక్సిన్‌ ఉత్పత్తి ప్రారంభమైన తర్వాత.. బీహార్‌లో ప్రతి ఒక పౌరుడికి ఉచితంగా ఆ టీకా ఇవ్వనున్నట్లు మంత్రి సీతారామన్‌ చెప్పారు. మా ఎన్నికల మ్యానిఫెస్టోలో మేం చేసిన తొలి వాగ్దానం ఇదే అని మంత్రి అన్నారు. పాట్నాలో జరిగిన కార్యక్రమంలో మంత్రి నిర్మలా.. బీహార్‌ ఎన్నికల మేనిఫెస్టోను రిలీజ్‌ చేశారు. ఎన్డీఏకు ఓటేసి గెలిపించాలని ఆమె ప్రజల్ని కోరారు. మరో అయిదేళ్ల పాటు నితీశ్‌ కుమార్‌ సీఎంగా ఉంటారన్నారు. ఆయన పాలనలోనే బీహార్‌ ఉత్తమ రాష్ట్రంగా అభివృద్ధి చెందుతుందని ఆమె అన్నారు. అయితే ఇంకా ఎప్పటికీ వస్తుందో స్పష్టత లేని కరోనా వ్యాక్సిన్లను బీహార్‌ ప్రజలకు ఉచితంగా అందిస్తామని బిజెపి మేనిఫెస్టోలో పేర్కొంది. దీనికి తోడూ రాష్ట్రంలో 19 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని ప్రకటించింది. రాష్ట్రంలో 3 లక్షల ఉద్యోగాల కల్పన తమ థ్యేయమని, 9 వ తరగతి నుండి ప్రతి విద్యార్థికి ఉచిత ట్యాబ్లెట్లు, రాష్ట్రాన్ని ఐటి హబ్‌గా మార్చి..10 లక్షల మందికి ఉద్యోగాల కల్పన, 30 లక్షల కుటుంబాలకు పక్కా ఇళ్ల ముంజూరు, ఆరోగ్య రంగంలో లక్ష మందికి ఉద్యోగాలు, 3 కోట్ల మంది మహిళలకు స్వయం ఉపాధి వంటి హావిూలను మ్యానిఫెస్టోలో పేర్కొంది. మరోవైపు వచ్చే ఐదేళ్ల పాటు తానే ముఖ్యమంత్రిగా ఉంటానని నితీష్‌ కుమార్‌ ధీమా వ్యక్తం చేశారు.

బిజెపి మేనిఫెస్టోపై మండిపడ్డ విపక్షాలు

బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బీజేపీ ప్రకటించిన ఉచిత కరోనా వ్యాక్సిన్‌ హావిూపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాజకీయ అజెండా కోసం వ్యాక్సిన్‌ను వాడుకుంటారా అని రాజకీయ ప్రత్యర్ధులు మండిపడుతున్నారు. రాష్ట్రంలో బీజేపీ పవర్‌లోకి వస్తే ప్రతి ఒక్కరికీ ఉచితంగా కరోనా టీకా అందిస్తామని నిర్మలా సీతారామన్‌ మేనిఫెస్టో ప్రకటన సందర్భంగా చెప్పారు. దీనిపై ఆమ్‌ ఆద్మీ పార్టీతోపాటు జమ్మూ కాశ్మీర్‌ మాజీ సీఎం ఒమర్‌ అబ్దుల్లా, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత శశి థరూర్‌ భగ్గుమన్నారు. కరోనా వ్యాక్సిన్‌ను రాజకీయ ఎజెండాగా మార్చడమేంటంటూ మండిపడ్డారు. వ్యాక్సిన్‌ను బిహార్‌కు మాత్రమే ఫ్రీగా అందిస్తారా? మిగిలిన రాష్ట్రాలకు అందించరా అంటూ ప్రశ్నించారు.బీజేపీయేతర రాష్ట్రాల పరిస్థితి ఏంటి..? బీజేపీకి ఓటు వేయని భారతీయులకు కోవిడ్‌-19 వ్యాక్సిన్‌ ఉచితంగా లభించదా అంటూ ఆమ్‌ ఆద్మీ పార్టీ ట్వీట్‌ చేసింది. సోషల్‌ విూడియాలోనూ బీజేపీ వ్యాక్సిన్‌ హావిూపై విమర్శలు వెల్లువెత్తాయి. బీజేపీ వ్యాక్సిన్‌ హావిూని నేషనల్‌ కాన్ఫరెన్స్‌ నేత ఒమర్‌ అబ్దుల్లా తప్పుపట్టారు. బీజేపీ తన పార్టీ నిధులతో ఈ వ్యాక్సిన్‌లు అందిస్తుందా అని ప్రశ్నించారు. ప్రభుత్వ ఖజానా నుంచి వీటిని అందచేస్తే బిహార్‌ ప్రజలకే ఉచితంగా అందించి మిగిలిన దేశ ప్రజల నుంచి డబ్బు వసూలు చేస్తారా అని నిలదీశారు. కాంగ్రెస్‌ నేత శశి థరూర్‌ సైతం ఉచిత వ్యాక్సిన్‌ హావిూని ఎద్దేవా చేశారు. మాకు ఓట్లు వేస్తే విూకు వ్యాక్సిన్‌ ఇస్తామని బీజేపీ ఇచ్చిన హావిూ సిగ్గుచేటని ఆయన వ్యాఖ్యానించారు. ఈ ప్రకటనపై ఈసీ చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేశారు.