నాకు రాజకీయాలు సరిపడవు 

– నేను రాజకీయాల్లోకి వస్తే మూడో ప్రపంచ యుద్ధమే!
– పెప్సికో మాజీ సీఈవో ఇంద్రానూయి
న్యూయార్క్‌, అక్టోబర్‌10(జ‌నంసాక్షి) : తాను రాజకీయాల్లోకొస్తే మూడో ప్రపంచ యుద్ధం వస్తుందేమోనంటూ పెప్సికో మాజీ సీఈవో ఇంద్రానూయి చమత్కరించారు. ఆసియా ఖండం గురించి ప్రపంచ దేశాల్లో చైతన్యం కలిగించే ఓ సంస్థ ఆమెకు ‘గేమ్‌ ఛేంజర్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ పురస్కారాన్ని అందించింది. ఈ సంస్థ న్యూయార్క్‌లో నిర్వహించిన వేడుకకు ఇంద్రానూయి హాజరై పురస్కారాన్ని అందుకున్నారు. వ్యాపారంలో అసాధారణ లక్ష్యాలు చేరుకోవడం సహా మహిళల్లో చైతన్యం కలిగించడం వంటి ఇతర కార్యక్రమాలు చేపట్టినందుకు గానూ ఆమెకు ఈ పురస్కారం వరించింది. ఈ సందర్భంగా ఆమె పలువురు అడిగిన ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. ‘పెప్సికో సీఈవో బాధ్యతల నుంచి తప్పుకున్న తర్వాత రాజకీయాల్లోకి ప్రవేశించి ట్రంప్‌ మంత్రివర్గంలో పనిచేయొచ్చు కదా..? అని అడిగిన ప్రశ్నకు నూయి సమాధానమిస్తూ.. ‘నాకూ రాజకీయాలకూ సరిపడదు. నేను మరీ దాపరికం లేకుండా మాట్లాడతా అన్నారు. దౌత్యపరంగా ఎలా వ్యవహరించాలో తెలీదని, అసలు ఆ పదానికి అర్థమే తెలీదన్నారు. నేను రాజకీయాల్లోకి వస్తే మూడో ప్రపంచ యుద్ధమే వస్తుంది’ అంటూ చమత్కరించారు. ‘నేను సీఈవో బాధ్యతల నుంచి తప్పుకొనేటప్పుడు చాలా కష్టంగా అనిపించిందని, గత 40 ఏళ్లుగా ఉదయాన్నే 4 గంటలకు నిద్రలేచి రోజంతా 18 నుంచి 20 గంటల పాటు ఉత్సాహంగా పనిచేసేదాన్ని అన్నారు. అంతర్జాతీయ శీతల పానీయ దిగ్గజం పెప్సికో సీఈవోగా 12ఏళ్లు పనిచేసి అక్టోబరు 2న 62ఏళ్ల ఇంద్రానూయి పదవి నుంచి తప్పుకున్నారు. ఆమె స్థానంలో 54 ఏళ్ల రామన్‌ లగర్తాను సీఈవోగా పెప్సికో బోర్ట్‌ డైరెక్టర్లు ఏకగ్రీవంగా
ఎన్నుకున్నారు.