నాణ్యమైన వైద్య సేవలు అందించాలి

– కంటి వెలుగు కేంద్రాలను కలెక్టర్‌లు పర్యవేక్షించాలి
– ఏరోజుకారోజు వివరాలను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేయండి
– ఏమైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురండి
– వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి శాంతి కుమారి
– కంటి వెలుగుపై జిల్లా కలెక్టర్‌లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించిన శాంతి కుమారి, కరుణ
హైదరాబాద్‌, ఆగస్టు18(జ‌నం సాక్షి) : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘కంటి వెలుగు’  కార్యక్రమంలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావివ్వద్దని, ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించేలా చర్యలు తీసుకోవాలని వైద్యారోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి శాంతి కుమారి కలెక్టర్‌లకు సూచించారు. శనివారం అన్ని జిల్లాల కలెక్టర్లు, వైద్యారోగ్య శాఖ అధికారులు, ఈ పథకం ముఖ్య నిర్వాహకులతో  కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్‌ వాకాటి కరుణ, ఆరోగ్య శ్రీ సీఈవో మాణిక్‌రాజ్‌ కలిసి శాంతికుమారి సచివాలయంలోని సీ బ్లాక్‌లో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా కంటి వెలుగు కార్యక్రమం నడుస్తున్న తీరు, ఎదురవుతున్న సమస్యలు, వాటి పరిష్కారాల విూద అధికారులు చర్చించారు. క్షేత్రస్థాయి ఉద్యోగులకు ఉన్నతాధికారులు తగు సూచనలు, సలహాలు ఇచ్చారు. ప్రజలకు నాణ్యమైన వైద్యసేవలు అందించాలని సూచించారు. కంటి వెలుగు శిబిరాలను సమర్థవంతంగా నిర్వహించాలని ఆదేశించారు. ప్రతి జిల్లా కలెక్టర్‌ తమ జిల్లాలో పర్యటిస్తున్న బృందాల వివరాలను ప్రతి రోజు పరిశీలిస్తూ, పర్యవేక్షించాలని ఉన్నతాధికారులు ఆదేశాలిచ్చారు. ప్రతి రోజు సాయంత్రం కంటి వెలుగు కార్యక్రమం వివరాలను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేయాలని ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం కంటి వెలుగు ను ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్వహిస్తుందని, ఎవ్వరూ పథకంలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దని సూచించారు. జనవరి వరకు ఈకార్యక్రమాన్ని నిర్వహించేలా చర్యలు తీసుకుంటున్నామని, ప్రతి ఒక్కరికి కంటి పరీక్షలు జరిగేలా చూడాలన్నారు. మరో మూడు నెలల్లో అంధత్వ రహిత రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అధికారులకు సూచించారు.
——————————-