నాతల్లిని ఎందుకు వేధిస్తున్నారు?

– ఎన్నికల సమయంలోనే నా అవినీతి గుర్తుకొచ్చిందా
– నేను ఎప్పుడూ నిబంధనలకు కట్టుబడే ప్రవర్తించా
– దేవుడు మాతో ఉన్నాడు.. ఎంతటి విచారణనైనా ఎదుర్కొంటాం
– అధికారులు అడిగే ప్రతి ప్రశ్నకు సమాధానం ఇస్తా
– ఫేస్‌బుక్‌లో రాబర్ట్‌ వాద్రా పోస్టు
జైపూర్‌, ఫిబ్రవరి12(జ‌నంసాక్షి) : ప్రభుత్వం దుర్మార్గం వ్యవహరిస్తుందని, ఎన్నికలకు నెలకు ముందు తమ అవినీతి విచారణ వారికి గుర్తుకొచ్చిందని.. ప్రమేయం లేని తన తల్లినిసైతం కేసుల పేరుతో వేధిస్తున్నారని.. తన తల్లి ఏం చేసిందని వేదిస్తున్నారంటూ ప్రియాంక భర్త రాబర్ట్‌ వాద్రా ఫేస్‌బుక్‌ వేదికగా ప్రశ్నించారు.
అక్రమంగా ఆస్తుల కొనుగోలు కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్‌ వాద్రా మరో కేసులో విచారణ నిమిత్తం మంగళవారం జైపూర్‌కు చేరుకున్నారు. విచారణ నిమిత్తం వాద్రాతో పాటు ఆయన తల్లి మౌరీన్‌ వాద్రాను సైతం హాజరు కావాలని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ కోరింది. దీంతో వృద్ధాప్యంలో ఉన్న తన తల్లిని వేధించాల్సిన అవసరం ఏముందంటూ రాబర్ట్‌ వాద్రా ఫేస్‌బుక్‌ వేదికగా మోదీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. నాలుగున్నరేళ్లుగా గుర్తుకురాని అవినీతి.. ఎన్నికల సమయంలోనే ఎందుకు లేవనెత్తుతున్నారని ప్రశ్నించారు. ఈడీ ఎదుట హాజరయ్యేందుకు నేను మా అమ్మ జైపూర్‌కు చేరుకున్నామని, కక్ష్య సాధింపు చర్యలకు పాల్పడుతున్న ఈ ప్రభుత్వం.. వయోభారంతో బాధపడుతున్న నా తల్లిని ఎందుకు వేధిస్తుందో అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. రోడ్డు ప్రమాదంలో కుమార్తెను.. డయాబెటిస్‌తో భర్త, ఓ కుమారుడిని కోల్పోయి బాధపడుతున్న నా తల్లికి తోడుగా ఉండడం కోసం నాతో పాటు ఆఫీసుకు రమ్మన్నానని, దీని ద్వారా తనకు కొంత ఊరట లభిస్తుందని ఆశించానని, నాతో ఆఫీసులో ఉన్నందుకుగానూ ఇప్పుడు ఆమెపై కూడా నేరాలు మోపి విచారిస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికే నన్ను మూడు రోజుల పాటు సుదీర్ఘంగా ప్రశ్నించారని, ఏదైనా చట్ట విరుద్ధంగా జరిగిందని విూరు భావిస్తే ఈ నాలుగేళ్ల ఎనిమిది నెలల పాలనలో కాకుండా.. సార్వత్రిక ఎన్నికల ప్రచారానికి కేవలం ఒక నెల ముందు ఎందుకు విచారిస్తున్నారన్నారని అన్నారు. ఎన్నికల జిమ్మిక్కుగా ప్రజలు దీన్ని అర్థం చేసుకోరని విూరు భావిస్తున్నారా అని ప్రశ్నించారు. నేను ఎప్పుడూ నిబంధనలకు కట్టుబడే ప్రవర్తించానని, దేవుడు మాతో ఉన్నాడని, ఎంతటి విచారణనైనా ఎదుర్కొంటానన్నారు. అధికారులు అడిగే ప్రతి ప్రశ్నకు సమాధానం ఇస్తానని ఫేస్‌బుక్‌లో రాబర్ట్‌ వాద్రా రాసుకొచ్చారు.