నావల్ల రాధను తప్పించారన్నది అవాస్తవం

– గడపగడపకు వైసీపీ నవరత్నాలను తీసుకెళ్తా
– సెంట్రల్‌లో పార్టీ బలోపేతానికి కృషి చేస్తా
– వైసీపీ నాయకుడు మల్లాది విష్ణు
విజయవాడ, సెప్టెంబర్‌19(జ‌నంసాక్షి) : నా వల్ల వంగవీటి రాధను తప్పించారన్నది అవాస్తవమని వైసీపీ నాయకులు మల్లాది విష్ణు అన్నారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు.. విజయవాడ సెంట్రల్‌ బాధ్యతలు ఇచ్చినందుకు వైసీపీ అధినేత జగన్‌కు మల్లాది విష్ణు ధన్యవాదాలు తెలియజేశారు. గడపగడపకు వైసీపీలో భాగంగా నవరత్నాలు కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తానని తెలిపారు. సెంట్రల్‌లో పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని ఆయన స్పష్టం చేశారు. పార్టీ బలోపేతానికి అందరిని కలుపుకొని పనిచేస్తానని చెప్పారు. తనకు ఎవరితోనూ విభేదాలు లేవన్న మల్లాది విష్ణు తన వల్ల రాధాను తప్పించారన్నది అవాస్తవమని స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌ సీపీని అధికారంలోకి తీసుకురావడమే తమ ధ్యేయమని ఆమేరకు అధినేత జగన్‌ సూచనల మేరకు ముందుకు సాగుతానని తెలిపారు. ఈ నెల 22వ తేదీన వైఎస్‌ జగన్‌ పాదయాత్ర 3వేల కిలోవిూటర్లు పూర్తవుతున్న సందర్భంగా సెంట్రల్‌ నియోజకవర్గం నుంచి గడపగడపకు వైసీపీ కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని అన్నారు. పార్టీ అధిష్టాన నిర్ణయం శిరోదార్యమని స్పష్టం చేశారు మల్లాది విష్ణు. తాను సామాన్య కార్యకర్తను, తనకు ఎవ్వరితోనూ విబేధాలు లేవన్న ఆయన, ఎవరు ఏ ఆరోపణలు చేసినా పాజిటివ్‌గానే స్పందిస్తానన్నారు. ఇదిలా ఉంటే విజయవాడ సెంట్రల్‌ సీటు
వివాదం వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో తీవ్ర వివాదాన్నే రేపింది… సెంట్రల్‌ సీటు ఆశీస్తోన్న వంగవీటి రాధాకృష్ణను కాదని… మల్లాది విష్ణును సెంట్రల్‌ నియోజకవర్గం ఇంచార్జ్‌గా పార్టీ నిర్ణయించడంతో అసంతృప్తి చెందిన వంగవీటి రాధా… వైసీపీ సమావేశం నుంచి మధ్యలోనే వెళ్లిపోయారు… ఆ తర్వాత అనుచరుల రాజీనామాలు, పార్టీ సభ్యత్వాలను చించివేయడం జరిగిపోయాయి. అయితే వైసీపీ చేపట్టిన గడపగడపకు వైసీపీ కార్యక్రమానానికి అటు వంగవీటి రాధా కానీ, మల్లాది విష్ణు కానీ, హాజరు కాకుండా దూరంగానే ఉన్నారు. అయితే ఈ వివాదంపై తొలిసారి విూడియా ముందుకు వచ్చి స్పందించారు మల్లాది విష్ణు స్పందించారు.