నిండుకుండలా సాగర్‌ జలాశయం

పర్యాటకుల రాకతో కళకళ
మత్స్యకార కుటుంబాల్లో ఉపాధి ఆనందం
నల్లగొండ,అక్టోబర్‌5  (జనంసాక్షి):  నాగార్జునసాగర్‌కు ఇన్‌ఫ్లోగా కొనసాగుతుండగా ప్రాజెక్టు నిండుకుండలా దర్శనిమిస్తోంది. చాలాకాలం తరవాత మల్లీ జలకళ సంతరించడంతో పర్యాకులు రాక పెరిగింది. వరుస సెలవులతో దసరాకు ముందే పర్యాటకుల రాక పెరిగింది. నిత్యం ఇక్కడికి సందర్శకులు భారీగా తరలి వస్తున్నారు.ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా  నిండుకుండను తలపిస్తోంది. నాగార్జున సాగర్‌ ప్రాజెక్టు దాదాపు పూర్తిస్థాయిలో నిండడంతో  తిలకించేందుకు పర్యాటకులు పోటెత్తుతున్నారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి విద్యార్థులు, ఉద్యోగులు, విదేశీయులు నందికొండకు తరలిరావడంతో లాంచీ స్టేషన్‌, బుద్ధవనం, నాగార్జునకొండ పరిసర ప్రాంతాలు పర్యాటకులతో కిటకిట లాడాయి. చాలా
మంది పర్యాటకులు నాగార్జునకొండకు వెళ్లేందుకు ఆసక్తి కనబర్చగా అందుకు అనుగుణంగా తెలంగాణ టూరిజంశాఖ లాంచీలను నడిపించింది. నాగార్జునసాగర్‌ జలాశయం నీటిమట్టం గరిష్ట స్థాయికి చేరుకోవడం, ఉభయ రాష్ట్రాల తెలుగు ప్రజలకు ప్రయోజనం చేకూరనుంది. కృష్ణా పరివాహక ప్రాజెక్టులు అన్ని నిండుకుండలా మారి జలకళను సంతరించుకున్నాయన్నారు. నాగార్జునసాగర్‌ రిజర్వాయర్‌ గరిష్ట స్థాయికి చేరినందున ఆయకట్టు రైతులకు రెండు పంటలకు నీరందించే అవకాశం ఉంది. సాగర్‌ నిండడంతో రిజర్వాయర్‌ పరిధిలో  మత్స్యకార్మిక కుటుంబాలు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి.  రిజర్వాయర్‌లోకి సమృద్ధిగా వచ్చి చేరిన కృష్ణమ్మ చూసి సంబుర పడుతున్నారు. సాగర్‌ లోతట్టు ప్రాంతాల్లో ఇతర ప్రాంతాల నుంచి వలసవచ్చి ఇక్కడ స్థిర నివాసం ఏర్పర్చుకున్న గంగపుత్రులతో పాటు, చేపల వృత్తే జీవనాధారంగా మత్స్యకారులు ఉత్సాహంగా చేపల వేటకు ఉపక్రమిస్తున్నారు. ఇరవైకి పైగా మర బోట్లు, పుట్టీలు ఉండగా వాటిల్లో చేపల వేటకు వెళ్తారు. కుటుంబ సభ్యులంతా ఇదే వృత్తిపై ఆధారపడి నిత్యం రూ.వేలల్లో ఆదాయం పొందుతారు. వేటాడిన చేపలు కేరళ, కోల్‌కత్తా తదితర ప్రాంతాలకు ఎగుమతి అవుతాయి. లోతట్టు ప్రాంతం వెంట జీవనం సాగిస్తున్న గిరిజనం సైతం చాలావరకు చేపల వేటను వృత్తిగా చేసుకుని బతుకుదెరువును సాగిస్తున్నది. ప్రభుత్వం వీరికి కూడా లైసెన్స్‌లు జారీచేసి ప్రభుత్వం పరంగా చేయూతనిస్తోంది. సాగర్‌ నిండటంతో గిరిజనులకు సైతం ఉపాధి మెండుగా కలుగుతున్నది. కృష్ణా నదిలో మత్స్యకారులు ఏడాదిలో 300 రోజులపాటు చేపల వేటను కొనసాగిస్తారు. గతకొంతకాలం చేపలవేటకు దూరమైన మత్స్యకారులు రిజర్వాయర్‌లోకి భారీగా వచ్చిన నీటితో తిరిగి చేపల వేటకు సన్నద్ధం అవుతున్నారు.  తెలంగాణ ప్రభుత్వం గతేడాది రిజర్వాయర్‌లోకి భారీగా చేప పిల్లలను వదలడం.. అవి పెరిగి పెద్దవ్వడంతో వలలో పడ్డ ఒక్కో చేప 20కిలోల వరకు ఉండి పుష్కలంగా ఆదాయం వస్తుందని వారు చెబుతున్నారు. చేపల బరువును బట్టి కిలోకు రూ.40 నుంచి రూ.100 వరకు దళారులు మత్స్యకారులకు చెల్లిస్తున్నారు. దీంతో చేపల వేట రూపంలో వచ్చే ఆదాయమంతా దళారుల జేబుల్లోకి వెళ్లిపోతోంది.