నిజాంసాగర్నిజాంసాగర్‌ నిండితే పంటలకు ఢోకా ఉండదు: షిండే

కామారెడ్డి,నవంబర్‌14(జ‌నంసాక్షి): నిజాంసాగర్‌ ప్రాజెక్ట్‌లో వచ్చే సంవత్సరం జులైలో కాళేశ్వరం నీళ్లు వస్తాయని, ఆయకట్టు సస్యశ్యామలం అవుతుందని జుక్కల్‌ టిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే అభ్యర్థి హన్మంత్‌ షిండే అన్నారు. కూటమి పేరుతో ప్రజలను మోసం చేయాలని చూస్తున్న కాంగ్రెస్‌ పార్టీ నాయకులకు ఈ ఎన్నికల తరవాత పుట్టగతులుండవని అన్నారు. నాలుగేళ్లలో సీఎం కేసీఆర్‌ అన్ని వర్గాల సంక్షేమానికి అనేక పథకాలు అమలుచేశారని తెలిపారు. షిండేను మరోసారి గెలిపించాలని ప్రజలను అభ్యర్థించారు.

ప్రజలు ప్రతీ విషయాన్ని గమనిస్తున్నారని, అభివృద్ధి చేస్తున్న పార్టీకే మద్దతుగా నిలుస్తారని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే అభ్యర్థి ఏనుగు రవీందర్‌రెడ్డి అన్నారు. 60 సంవత్సరాలలో జరిగిన అభివృద్ధి నాలుగున్నర సంవత్సరాలలో చేసి చూయించిన టీఆర్‌ఎస్‌వైపే ప్రజలు మొగ్గు చూపుతున్నారన్నారు. కులవృత్తులకు చేయూత, చిన్న గ్రామ పంచాయతీలతో అభివృద్ధి, రైతును రాజు చేసే వివిధ పథకాలు, కంటి వెలుగు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌, మిషన్‌ భగీరథ, మిషన్‌ కాకతీయ తదితర పథకాలతో ప్రజల మనస్సుల్లో నిలిచిపోయిందని తెలిపారు. ప్రజలు పనిచేసే వారికే ఓటువేయాలన్నారు. తాను నిరంతర శ్రామికుడినని, ఎల్లారెడ్డిని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసే వరకు పనిచేస్తూనే ఉంటానని అన్నారు.