నిజాం షుగర్స్‌పై గట్టి హావిూ లేకుండానే ప్రచారం

కౌలు రైతులకు కూడా అండగా ఉండేలా కానరాని చొరవ

గిట్టుబాటు ధరలపైనా భరోసా దక్కడం లేదు

హైదరాబాద్‌,నవంబర్‌15(జ‌నంసాక్షి): తెలంగాణ ఎన్నికల్లో నిజాం షుగర్స్‌ ఫ్యాక్టరీ తెరిపించడం, పసుపు బోర్డు ఏర్పాటు చేయడం, చెరకు రైతులకు గిట్టుబాటు ధరలు అందించడం వంటి సమస్యలు ప్రస్తవానకు రావడం లేదు.ఇన్నాళ్లూ దీనిపై అనేక విమర్శలు చేసన కాంగ్రెస్‌ పార్టీ కూడా దీనిపై ఎక్కడా గట్టిగా మాట్లాడిన దాఖలాలు లేవు. పసుపు బోర్డు ఏర్పాటుకు ఎంపి కవిత ఎన్నో ప్రయత్నాలు చేశారు. నిజాం షుగర్స్‌పై అసెంబ్లీలో చర్చించారు. అయినా ఈ రెండు సమస్యలకు మాత్రం పరిష్కారం దక్కలేదు. నిజంగానే అధికారంలోకి వస్తే ఏం చేస్తారన్న దానిపై స్పష్టత రావడం లేదు. ఇకపోతే రుణమాఫీపై పెట్టిన ఫోకస్‌ గిట్టుబాటు ధరలపై కానరావడం లేదు. కేంద్రంతో ఏ రకంగా పోట్లాడేది తెలియడం లేదు. దీంతో అన్నదాతలకు భరోసా రావాల్సి ఉంది.ఏ పంటపండించినా గిట్టుబాటు ధరలు లభించడం లేదు. దీనికి తాజా ఉదాహరణ కంది, మిర్చి పంటలే. ప్రధానంగా రైతుబంధు భూమి ఉన్నవారికే మేలు చేస్తోంది. లక్షలాదిగా ఉన్న కౌలురైతుకు మాత్రం భరోసా దక్కలేదు. ఈ వర్గం రైతులను ఆదుకునేలా కార్యక్రమాలు ప్రకటించాల్సి ఉంది. మనరైతులనే ప్రోత్సహించి మన పంటలనే కాపడుకునేలా రైతాంగ విధానాలు వస్తే తప్ప వారు బతికి బట్ట కట్టేలా లేరు. కరువులు వచ్చినా, వర్షాలు కురిసినా రైతుల దుర్భర పరిస్థితులలో ఎలాంటి మార్పూ కనిపించడం లేదు. మరోవైపు ప్రతి సంవత్సరం వేలాది మంది రైతులు పట్టణాలకు వలస వెళ్ళి దినసరి కూలీలుగా మారుతున్నారు. చిన్నాచితక వ్యాపారాలతో తోపుడు బళ్లు నడుపుతున్నారు. వ్యవసాయభూమి లేని కూలీలు కౌలుకు తీసుకొని నష్టాలపాలయి బ్రతుకునీడ్చలేక, అవమానం భరించలేక, చివరికి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. రైతులని కాపాడుకుని, వ్యవసాయాన్ని పండగ చేస్తామంటున్న ప్రభుత్వాలు ఆ దిశగా అడుగులు వేయాలి. చిత్తశుద్ధితో పనిచేసే వ్యవస్థను రూపొందించాలి. రైతులను ఓటు బ్యాంకుగా చూడకుండా మనకు పట్టెడు అన్నం పెట్టే తల్లిగా చూసుకోవాలి. రైతుల సమస్యలను పట్టించుకునే దిశగా కేంద్ర,రాష్ట్రప్రభుత్వాలు కీలక నిర్ణయాలు తీసుకోవాలి. ఏటా ఒక విధానంగా గాకుండా, రుణమాఫీలు అవసరం లేని విధంగా రైతులు స్వయం సమృద్దిగా ఎదిగేలా చేయాలి.ఫ్రీ మార్కెట్‌ అనేది ఒక అభూత కల్పన మాత్రమే అయ్యింది. దేశ ఆర్థిక వ్యవస్థ 8నుంచి 9శాతం వరకూ వృద్ధి జరుగుతున్నప్పటికీ, వ్యవసాయ ఉత్పత్తులు పెరుగుతన్నా రైతుల ఆర్థిక వ్యవస్థ మాత్రం బాగుపడడం లేదు. అవసరం లేకున్నా ఇబ్బడిముబ్బడిగా ఆహారధాన్యాలను దిగుమతి చేసుకోవడం కూడా రైతులకు శాపంగా మారింది. కల్తీలు కూడా రైతును కాటేస్తున్నాయి. మన అసవరాలకు సరిపడా కందులు, మిరప, ఇతర పంటలను రైతులు చెమటోడ్చి పండించినా వాటిని కొనుగోలు చేయడం లేదు. రైతుల సమస్యలు రాజకీయ పక్షాలకు ప్రచార కార్యక్రమంగానే మిగిలిపోయాయి. పాలకపక్షం అయినా, ప్రతిపక్షం అయినా రైతుల సమస్యలను పరిష్కరించడానికి చిత్తశుద్ధితో ఆలోచించడం లేదు. గిట్టుబాటు ధరలు లేక వచ్చిన ఆదాయం కూలీల ఖర్చుకు సరిపోతుంది. ప్రతి ఎకరాకు కౌలు 10 వేల నుంచి 25 వేల రూపాయల వరకు భూమి యజమానులకు చెల్లించవలసి వస్తుంది. లక్షలాది మంది రైతులు వర్షాలు కురిసి కాలం మంచిగా అయినప్పటికీ ధరలు రాక నష్టపోతున్నారు. వర్షాలు లేని సంవత్సరంలో పంటలు ఎండిపోయి నష్ట పోతున్నారు. కాలం అయినా గాని, కరువు అయినా గాని రైతుకు మిగిలేది అప్పులే. మార్కెట్‌లో రైతును దోచుకునే శక్తులు నిరాటంకంగా విజృంభిస్తూనే ఉన్నాయి. తెలంగాణలో పరిస్థితిని మార్చేలా తీసుకున్న

చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయి. రైతులకు పెట్టబడితో పాటు రాయితీ విత్తనాలు,ఎరువులు అందుతున్నాయి. అలాగే బీమా సౌకర్యం రాబోతున్నది. ఇకపోతే 24 గంటల ఉచిత కరెంట్‌ అందుతోంది. ఇదే దశలో సేంద్రియ వ్యవసాయానికి ప్రోత్సాహకాలు పెంచాలి. అప్పుడే మార్పు కనిపిస్తుంది. రైతులకు భరోఎసా దక్కి వ్యవసాయం ముందుకు సాగుతుంది.