నిజాయితీ లోపం సమాజానికి చేటు

నేటి సమాజంలో నీతి నిజాయతీలు లోపిస్తున్నాయని, విలువలు తరిగిపోతున్నాయన్నది కఠిన వాస్తవం. మంచైనా, చెడైనా పెద్దలను చూసి చిన్నవారు నేర్చుకుంటారు. పెద్దవారు పద్ధతిగా ఉంటే, చిన్నవారు వారిని అనుసరిస్తారు. నీతి నిజాయతీ, క్రమశిక్షణ, సమయపాలనలతో ఉన్నత శిఖరాలను అధిరోహించిన మహానుభావులు ఎందరో ఉన్నారు. వారి జీవిత చరిత్రలను పిల్లలకు తల్లిదండ్రులు కథలు కథలుగా ఉదాహరణలతో హృదయానికి హత్తుకునేలా చెప్పగలగాలి. ప్రతి తల్లి, తండ్రి తమ సంతానం వరకు ఉత్తమ ఉపాధ్యాయులు కావాలి. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు తాము ఆచరిస్తూ చెప్పే బోధలు పిల్లలపై అత్యంత ప్రభావం చూపిస్తాయి. గాంధీ మహాత్ముడి స్వీయచరిత్ర నైతిక ప్రవర్తనకు ఉత్తమ పాఠ్య గ్రంథం. గాంధీజీ బాల్యంలో హరిశ్చంద్ర నాటకం చూసి, ఎన్ని కష్టాలు వచ్చినా సత్యాన్నే పలకాలని నిశ్చయించుకున్నారట. బాల్యంలో పడే ముద్ర అంత గాఢంగా ఉంటుంది.నీతి నిజాయతీ, అహింస, సత్యసంధత, క్రమశిక్షణ, సమయపాలన, నిబద్ధత, సత్పవ్రర్తన… వీటన్నింటి సమాహారమే నైతిక జీవనం! నీతిమంతమైన జీవితం అలవడాలంటే చిన్నారులకు బాల్యం నుంచే పుస్తక పఠనం అలవరచాలి. ప్రాచీన సాహిత్యంలో గురుశిష్య పరంపరపై ఉత్తమ కథలున్నాయి. అవేవీ చదవకుండా, వినకుండా సత్పవ్రర్తన ఎలా అలవడుతుంది; పాఠ్యాంశాల్లో ఉండే విషయాలు పరీక్షలకే పరిమితమైతే జీవితం గాడి తప్పక ఏమవుతుంది?నేర్చుకున్న విషయాలను జీవితంలో అమలుపరచకపోతే వ్యక్తిత్వం ఏనాటికీ వికసించదు.

చదువుకున్న చదువుకు, జీవిత విధానానికి మధ్య ఉన్న పెద్ద అగాధం పూడ్చుకొన్నప్పుడే మానవ జీవితంలో మార్పు సాధ్యపడుతుంది. చేసే పనుల్లో చిత్తశుద్ధి, మమేకత లేకపోతే ఆ పనులకు విలువ ఉండదు.