నిద్రిస్తున్న కుక్కపై వేడి తారుతో చంపేశారు

సోషల్‌ విూడియాలో జంతు ప్రేమికుల ఆగ్రహం

లక్నో,జూన్‌13(జ‌నం సాక్షి ): యూపిలో ఈ మధ్య అనేక వింతలు చోటు చేసుకుంటున్నాయి. నిర్లక్ష్యంగా విధులు నిర్వహిస్తున్నారు. ఆగ్రాలోని ఫతేబాద్‌లో ఘోరం జరిగింది. నిద్రిస్తున్న కుక్కపై తారు రోడ్డు వేసి.. సజీవ సమాధి చేశారు. ఈ ఘటనపై జంతు ప్రేమికులు, స్థానిక ప్రజలు భగ్గమన్నారు. మనుషులకే విలువ ఇవ్వని అధికారగణం.. మూగజీవాలకు ఏం ఇస్తుందులే అంటూ ఫైర్‌ అవుతున్నారు. ఆగ్రాలోని ఫతేబాద్‌లో ఇటీవల తారు రోడ్డు వేశారు. ఈ రోడ్డు కాంట్రాక్టు తీసుకున్న ఆర్‌పీ ఇన్‌ఫ్రా వెంచర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థకు చెందిన అధికారులు రోడ్డు పనులను రాత్రి సమయంలో ప్రారంభించి.. తెల్లవారేసరికి పూర్తిచేశారు. అయితే రోడ్డు పక్కన నిద్రిస్తున్న కుక్కను గమనించకుండా.. దానిపైనే తారు రోడ్డు వేశారు. వేడి తారులో చిక్కుకున్న కుక్క.. తీవ్ర బాధతో ప్రాణాలను విడిచింది. రోడ్డు పని అంతా అయిపోయాక కుక్కను గమనించిన సిబ్బంది.. జేసీబీ సాయంతో తారు రోడ్డును తవ్వి.. కుక్కను బయటకు తీశారు. దీనికి సంబంధించి వీడియో ఇప్పుడు సోషల్‌ విూడియాలో వైరల్‌ అయింది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు రోడ్డు వేసిన కాంట్రాక్టర్‌, సిబ్బందిపై భగ్గమంటున్నారు. సామాజిక కార్యకర్తలు, జంతు ప్రేమికులు సదరు కాంట్రాక్ట్‌ సంస్థపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై సామాజిక కార్యకర్తలు, శునక ప్రేమికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘తాజ్‌మహల్‌, పరిసర ప్రాంతాల్లో తారు రోడ్డు వేస్తున్నారు. రోడ్డుకు చివరన ఓ శునకం నిద్రపోతుంది. దాన్ని అక్కడి నుంచి తరమడమో లేదా పక్కకు తీసుకెళ్లడమో చేయకుండా అలాగే పొగలుకక్కుతున్న తారును దాని విూద పోశారు. తరవాత రోడ్డు రోలర్‌ దాన్ని తొక్కుకుంటూ వెళ్లింది.’ అని నరేశ్‌ పరాస్‌ అనే సామాజిక కార్యకర్త చెబుతున్నారు. జంతు హింస నిరోధక చట్టం కింద పోలీసు స్టేషన్‌లోఅతను ఫిర్యాదు చేశారు. ఈ ఘటనకు కారకులైన వారిపై చర్య తీసుకోవాలని స్థానికులు సర్దార్‌ పోలీసులు స్టేషన్‌ ఎదుట ఆందోళనకు దిగారు. సగం రోడ్డు కింద నలిగిపోయిన శునకం ఫొటో బుధవారం సామాజిక మాధ్యమాల్లో కనిపించడంతో నెటిజన్లు, హక్కుల కార్యకర్తలు దానిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దాంతో ఈ ఘటనకు కారణమైన వారిపై చర్యలు తీసుకుంటామని ప్రాజెక్టు కాంట్రాక్టరు వెల్లడించారు.