నిధుల కోసం సర్పంచ్‌ల ఎదురుచూపు


నిధులు వస్తేనే అభివృద్ధికి అవకాశం
హైదరాబాద్‌,ఫిబ్రవరి20(జ‌నంసాక్షి): గతంలో మన వూరు-మన ప్రణాళిక కార్యక్రమంలో  గ్రామాల్లో నెలకొన్న సమస్యలు, చేపట్టాల్సిన పనులు, ఆర్థిక వనరులు, తదితర వివరాలతో కూడిన సమగ్ర ప్రణాళికలు రూపొందించారు. తాజాగా మళ్లీ ప్రతిపాదనలు వస్తే నిధులు వస్తాయన్న ఆశతో కొత్తగా ఎన్నికైన సర్పంచ్‌లు ఉన్నారు. అయితే వీటికి సంబంధించిన నిధులు గతంలో విడుదల కాకపోవడంతో ఆ
ప్రణాళికలు బుట్టదాఖలయ్యాయి. గతంలో గ్రామ, మండల, జిల్లా ప్రణాళికలు రూపొందించారు. 2014 జులైలో నెల రోజులు గ్రామ, మండల, జిల్లాలో చేపట్టాలని పనులను గుర్తించారు.  ఆ సమయంలో నెలరోజులపాటు గ్రామాల్లో పర్యటించిన ప్రణాళికలు తయారు చేశారు. గ్రామాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించి పనులు గుర్తించిన అధికారులు గ్రామ సభలు నిర్వహించారు. నిధుల అంచనాలతో అభివృద్ధి పనుల ప్రణాళికలు దస్త్రాల్లోనే మగ్గుతున్నాయి. వీటిని సంబంధించి నిధులు కేటాయించకపోవడంతో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఉంది.  ఆ సమయంలో రహదారులు, తాగునీటికి అధిక ప్రాధాన్యం ఇచ్చారు. వాగులపై వంతెనల నిర్మాణాలతో పాటు అన్ని గ్రామాలకు బీటీ రహదారులు, అవసరమైన చోట కల్వర్టుల నిర్మాణాలు చేపట్టాలని ప్రతిపాదించారు. ప్రాజెక్టుల ద్వారా మంచినీటి సరఫరా చేయాలని నిర్ణయించారు. జిల్లాలోని అన్ని జలాశయాల నుంచి తాగునీటిని సరఫరా చేయాలని  అంచనా వేశారు. మెరుగైన విద్యుత్‌ సౌకర్యం నిధులు  అవసరం పడుతాయని గుర్తించారు. అప్పుడే పుట్టిన పిల్లల సంరక్షణకు కేర్‌ యూనిట్లు, పోషకాహార కేంద్రాలు, సామాజిక ఆసుపత్రుల నిర్మాణాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో అధునాతన వైద్య పరికరాల కోసం నిధుల విడుదల కోరుతూ  ప్రతిపాదనలు పంపించారు. పంచాయతీరాజ్‌ శాఖలో కొత్త రహదారుల నిర్మాణాలకు  అంచనా వేశారు. ఇలా విద్యారంగం బలోపేతం చేయడానికి  ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపించారు. ఇలా మిగితా శాఖలకు సంబంధించి అవసరమైన నిధుల కోసం పంపించిన ప్రతిపాదనల పంపారు.  ఈ సారైనా నిధులు మంజూరు చేస్తారని గంపెడాశతో గ్రామ సర్పంచులు ఎదురుచూస్తున్నారు. మన వూరు-మన ప్రణాళికలో ఆరు అంశాలకు ప్రాధాన్యత ఇచ్చారు. ఇందులో విద్యా, వైద్యం, వ్యవసాయం-భూమి వినియోగం, ఉపాధి-జీవనోపాయాలు, మౌలిక సదుపాయాలు, వనరుల సవిూకృత అంశాలకు ప్రాధాన్యం కల్పించి ప్రణాళికలు రూపొందించారు. ఈ అంశాలకు సంబంధించి ఆరు ప్రత్యేక కమిటీలు ద్వారా పనులు గుర్తించారు కూడా. నెలవారీగా సమావేశాలు ఏర్పాటుచేసి పనుల ప్రగతిపై సవిూక్షించాలి. రెండేళ్ల క్రితం ఉమ్మడి జిల్లాగా ఉన్న సమయంలో గ్రామస్థాయిలో అనేక పనుల గుర్తించారు. గ్రామ పంచాయతీ పరిధిలో మూడు, మండల పరిధిలో పది, జిల్లాస్థాయిలో 30 పనుల చొప్పున ప్రాధాన్యం వారీగా పనులకు సంబంధించి అంచనా వ్యయంతో పనులను ప్రభుత్వానికి ప్రతిపాదించారు.