నిబంధనలకు విరుద్దంగా నీటిప్లాంట్లు

కరీంనగర్‌,ఫిబ్రవరి18(జ‌నంసాక్షి): వివిధ గ్రామాల్లో వాటర్‌ ప్లాంట్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి.వాటర్‌ ప్లాంట్లలో శుభ్రత కొరవడా, యంత్రాలు తుప్పు పట్టి,పరిసర ప్రాంతంలో పరిశుభ్రత కొరవడిన ప్రాంతాల్లోనే మంచినీటిని తారు చేస్తున్నారు. నీటిని శుద్ది చేసిన తేదీ వివరాలు నోటీసు బోర్డులో ఏ ఒక్కరూ పొందుపర్చడం లేదు. కూల్‌ వాటర్‌ పేరిట సరఫరా చేస్తున్న నీటిలో కూలింగ్‌ కోసం ఐస్‌ గడ్డలను వేసి సరపరా చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. మరికొన్ని ప్లాంట్లలో నల్లాల ద్వారా సరపరా అయ్యే నీటిని నింపి విక్రయిస్తున్నారనే అభిప్రాయం  వ్యక్తమవుతుంది. ఫ్యూరిఫైడ్‌ వాటర్‌ పేరుతో మామూలు నీటినే వినియోగదారులకు అంటగడుతున్న ప్లాంట్లపై అధికారులు పట్టించుకోవడం లేదు.  ప్లాంటులకు అనుమతులు లేకుండా నిబంధనలు పాటించకుండా నిర్వహిస్తున్నా సంబంధిత అధికారులు మాత్రం ఏం పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. అధికారుల పర్యవేక్షణ లోపం కారణంగా నిబంధనలు పాటించకుండా  నీటిని విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. శుద్ధి చేయని నీటినే నింపి సొమ్ము చేసుకుంటున్నారు. ఇంత జరుగుతున్నా సంబందిత అధికారులు తమకేం తెలియదంటూ నిర్లక్ష్యంగా ఉండటం పలు ఆరోపణలకు తావిస్తున్నది. ప్లాంటు లో పనిచేసే వ్యక్తులు కనీసం జాగ్రత్తలు పాటించకపోగా, నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో జబ్బుల ముప్పు అవకాశం ఉంది.  అనుమతులు లేని వాటిపై అధికారులు అంటిమట్టనట్లుగా వ్యవహరించడంతో ప్లాంటు యజమానులు తమ ఇష్టం వచ్చినట్లుగా కొనసాగిస్తున్నారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్దంగా అనుమతి లేకుండా తయారు చేస్తున్న ప్లాంట్ల యజమానులపై చర్యలు తీసుకుంటామని అధికారులు అన్నారు.