నిరుద్యోగులను నిలువునా ముంచిన కెసిఆర్‌

ఆశలు చూపి వారిని మోసం చేశారు

పోరాటాలు మాకు కొత్తకాదు: మల్లేశ్‌

ఆదిలాబాద్‌,నవంబర్‌19(జ‌నంసాక్షి): పోరాటాలు సీపీఐకి కొత్తేవిూ కాదని మాజీ ఎమ్మెల్యే గుండా మల్లేష్‌ తెలిపారు. బెల్లంపల్లి నుంచి మరోమారు సిపిఐ నేతగా బరిలోకి దిగిన మల్లేశ్‌ నాలుగేళ్ల తెలంగాణ రాష్ట్ర సమితి వైఫల్యాలను తూర్పారా పట్టారు. ప్రజలకు ఆశలు చూపి వమ్మ చేవారని, నయా నిజం నవాబు పాలన సాగించారని మండిపడ్డారు. విద్య, వైద్యంతో పాటు జీవించే హక్కును హరించే పరిస్థితులు తెలంగాణలో ప్రస్తుతం నెలకొన్నాయని అన్నారు. ఇపుడు రాష్ట్రంలో సంక్షేమ,అభివృద్ది పథకాలు సంపూర్ణ స్థాయిలో అమలు చేయాల్సి ఉందని, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకుమహాకూటమిగా ముందుకు వస్తున్నట్లు మాజీ ఎమ్మెల్యే గుండా మల్లేష్‌ తెలిపారు. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీలకు నిధులు రావడం లేదు.. బీసీల వెనుకబాటుతనం అలాగే ఉందని తెలిపారు. అలాగే తెలంగాణ ఉద్యమ సమయంలో చెప్పినట్లుగా లక్ష ఉద్యోగాల ప్రకటన బూటకమని తేలిందన్నారు. ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేసి నిరుద్యోగ అభ్యర్థులకు భరోసా కల్పించడంలో కెసిఆర్‌ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని అన్నారు. ప్రభుత్వ శాఖలు, జూనియర్‌, డిగ్రీ, ఏయిడెడ్‌, పాలిటెక్నిక్‌ కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్న వేలాది ఖాళీలను వెంటనే భర్తీ చేసి నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలను అందించడంలో విఫలమయ్యారని అన్నారు. విశ్వవిద్యాలయాల్లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులు భర్తీ చేయకపోవడంతో విద్యాప్రమాణాలు

దెబ్బతిన్నాయన్నారు. ప్రస్తుతం ప్రజాస్వామ్యం ప్రమాదపుటంచుల్లో అన్నారు. కలుషిత రాజకీయాలను ప్రక్షాళన చేయడమే సీపీఐ లక్ష్యమన్నారు. తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్న కమ్యూనిస్టులను అవమానపరిచేలా సిఎంకెసిఆర్‌ చరిత్రను వక్రీకరించేలా నిజాం నవాబును పొగడడం సిగ్గుచేటన్నారు. తెలంగాణ రాష్ట్రం త్యాగాలతో సాధించుకున్నవేనని గుర్తు చేశారు. ప్రస్తుతం రాజకీయాలు భ్రష్టు పడుతున్నాయని, ఎప్పుడూ లేని విధంగా పార్టీ ఫిరాయింపులు అధికమయ్యాయని అన్నారు. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల తీరు నియంతృత్వాన్ని తలపిస్తోందని అన్నారు. ధరలను నియంత్రించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని సీపీఐ నాయకుడు ఆరోపించారు. ఉప్పులు, పప్పులు, నూనె, కూరగాయల ధరలు మండిపోతున్నాయని, ప్రభుత్వాలు మాత్రం స్పందించడం లేదని ధ్వజమెత్తారు. అధిక ధరలను నిరసిస్తూ, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను, ఎఫ్‌డీఐలను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఎన్నికల ముందు ధరలను నియంత్రిస్తామని గ్దదెనెక్కిన ప్రధాని మోదీ విఫలమయ్యారని విమర్శించారు. యుద్ధ ప్రాతిపదికన ధరలను నియంత్రించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్‌ చేశారు.