నిరుద్యోగులను మోసం చేస్తున్నారు: టిడిపి

నిజామాబాద్‌,జూలై13(జ‌నం సాక్షి): నీళ్లు, నియామకాల కోసం సాధించిన తెలంగాణ రాష్ట్రంలో రైతులకు నీళ్లు లేవు, నిరుద్యోగులకు ఉద్యోగాలు లేవని టిడిపి జిల్లా అధ్యక్షుడు సుభాష్‌రెడ్డి పేర్కొన్నారు. ఇచ్చిన హావిూలను విస్మరించడమే గాకుండా కాలక్షేపపు కబుర్లతో ప్రజలను మోసపుచ్చుతున్నారని అన్నారు. లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పిన ముఖ్యమంత్రి నేటి వరకు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారన్నారు. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో ప్రభుత్వ యంత్రాంగం పూర్తిగా విఫలమైందని అన్నారు. రాష్ట్రంలో నిరుద్యోగులు ఉద్యోగ ప్రకటనల కోసం నిరీక్షిస్తున్నా సర్కారు స్పందించకపోవడం శోచనీయమన్నారు. బకాయి ఫీజులను వెంటనే చెల్లించాలని అన్నారు. ఒప్పంద ఉద్యోగులకు పనికి తగిన వేతనాలు ఇవ్వాలని డిమాండు చేశారు. రైతులకు రుణమాఫీ, రెండు పడకల గదుల ఇళ్ల నిర్మాణం ఏవీ ఆచారణలో అమలు కావడం లేదన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రతిఒక్కరికి ప్రశ్నించే హక్కు ఉంటుందని పేర్కొన్నారు. తెరాస ప్రభుత్వం, నాయకులు ప్రజ సమస్యలపై మాట్లాడే వారిని విమర్శించడం అలవాటుగా చేసుకున్నారని ఎద్దేవా చేశారు. హరితహారంలో చిత్తశుద్ది కొరవడిందని, దీని పేరుతో నిధులు దుర్వినియోగం చేస్తున్నారని అన్నారు.

————