నిరుద్యోగుల ఆందోళనలను అర్థం చేసుకోవాలి

హావిూలను పెడచెవిన పెట్టారన్న ఏలేటి

ఆదిలాబాద్‌,ఆగస్ట్‌17(జ‌నం సాక్షి ): నిరుద్యోగ గర్జన సభ విజయం కావడంతో ఇక ప్రభుత్వం తన పంథాను మార్చుకోవాలని డిసిసి అధ్యక్షుడు ఏలేటి మహేశ్వర్‌ రెడ్డి అన్నారు. నిరుద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రస్తావించడం ద్వారా యువతలో ఉన్న నైరాశ్యాన్ని ఎత్తి చూపామని అన్నారు. గర్జనను విజయవంతం చేయడం ద్వారా నిరుద్యోగులు తమ నిరసనలను,ఆందోళనలు తెలిపారు. కాంగ్రెస్‌ హయాంలో ఎప్పుడూ న్యాయం జరిగేదని, అందుకే వారు కాంగ్రెస్‌ సభను విజయవంతం చేశారని అన్నారు. టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం అవినీతి అక్రమాలకు పాల్పడుతోందని, అందుకే తాము ప్రజలకు తెలియచేశామని అన్నారు. కాంగ్రెస్‌ హయంలో మంజూరైన జలాశయాలను పూర్తిచేయాల్సింది పోయి పునరాకృతి పేరుతో కొత్త జలశయాలకు తెరలేపి కాంట్రాక్టర్లనుంచి కవిూషన్లు తీసుకుంటూ దోచుకుంటున్నారని ఆరోపించారు. తెలంగాణ ఏడు జిల్లాలకు సాగునీరు, తాగునీరు అందించే ప్రాణహిత చేవళ్ల జలశయానికి కేవలం రూ.20కోట్లు విడుదలచేస్తే పనులు పూర్తి అవుతుండగా కేసీఆర్‌ మాత్రం జలాశయాన్ని మేడిగడ్డకు మళ్లించి అంచనా వ్యయం ఏకంగా రూ.86వేల కోట్లకు పెంచడంతో అవినీతికి తెరలేపారని అన్నారు. ఇది కేవలం కవిూషన్ల కోసం కాక మరోటి కాదన్నారు. టిఆర్‌ఎస్‌ సర్కార్‌ గుత్తేదార్ల ప్రభుత్వంగా మారిందంటూ విమర్శలు సంధించారు. తెలంగాణ వచ్చాక కేవలం కేసీఆర్‌ కుటుంబమే లాభపడుతోందన్నారు. జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రులు సమస్యలను పక్కన పెట్టి అవినీతికి పాల్పడుతున్నా పట్టించుకోని సిఎం కెసిఆర్‌ ప్రజలను ఏం పట్టించుకుంటారని అన్నారు. అధికారాన్ని ఉపయోగించి తమ పార్టీ నేతలు, కార్యకర్తలను బెదిరింపులకు పాల్పడితే చూస్తూ ఊరుకునేది పేర్కొన్నారు.ఎప్పటికైనా కాంగ్రెస్‌ పార్టీయే అధికరాంలోకి వస్తుందని అన్నారు.