నీకు అండగా ఎప్పుడూ ఉంటా

ప్రియాంక రాజకీయ ప్రవేశంపై వాద్రా

న్యూఢిల్లీ,జనవరి23(జ‌నంసాక్షి): ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెడుతున్న తన భార్య ప్రియాంక గాంధీ వాద్రాకు రాబర్ట్‌ వాద్రా అభినందనలు తెలిపారు. ‘నీ జీవితంలోని ప్రతి దశలో ఎల్లప్పుడూ నీకు తోడై నీ వెంటే ఉంటాను. నీకు సాధ్యమైనంత గొప్పగా పనిచెయ్యి’ అని వాద్రా ఆమెను ప్రోత్సహిస్తూ ఫేస్‌బుక్‌లో పోస్టు చేశారు. ఆయనతో పాటు పలువురు కాంగ్రెస్‌ నేతలు ప్రియాంక గాంధీ రాజకీయాల్లోకి రావడంపై ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ‘ఉత్తర్‌ప్రదేశ్‌ తూర్పు ప్రాంత ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా నియమితులైన ప్రియాంక గాంధీకి అభినందనలు. విూ సారథ్యంలో పార్టీకి ఘన విజయాన్ని అందిస్తారని ఆశిస్తున్నాం’ అంటూ యూత్‌ కాంగ్రెస్‌ ట్వీట్‌ చేసింది. ‘ప్రధాన కార్యదర్శిగా ప్రియాంక గాంధీ నియామకాన్ని మేం స్వాగతిస్తున్నాం. క్రియాశీలక రాజకీయాల్లోకి ఆమె రాక కార్యకర్తలను ఉత్తేజపరుస్తుంది’ అని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత కపిల్‌ సిబాల్‌ అభిప్రాయం వ్యక్తం చేశారు. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య.. ప్రియాంక గాంధీ వాద్రాతో పాటు, జ్యోతిరాదిత్య సింథియా, కేసీ వేణుగోపాల్‌లకు అభినందనలు తెలిపారు. ప్రియాంక నియామకం యూపీలో కాంగ్రెస్‌ పునరుత్తేజానికే కాకుండా దేశంలోనూ సహాయపడుతుందని ఆ పార్టీ నేత రాజీవ్‌ శుక్లా అభిప్రాయం వ్యక్తం చేశారు. ఫిబ్రవరి 1 తర్వాత ఆమె విదేశాల నుంచి తిరిగి వచ్చిన అనంతరం తనకు కేటాయించిన బాధ్యతలను స్వీకరిస్తారని తెలిపారు. ప్రియాంక గాంధీ, జ్యోతిరాదిత్య సింథియాలు శక్తిమంతమైన నాయకులు. ఉత్తర్‌ప్రదేశ్‌ రాజకీయాలను ఈ ఇద్దరు యువనేతలు మార్చగలరని ఆశిస్తున్నా. కాంగ్రెస్‌ పార్టీ సిద్దాంతాలను ప్రియాంక మరింత ముందుకు తీసుకెళ్లగలదని విశ్వసిస్తున్నా. సింథియా చైతన్యవంతమైన నాయకుడు’ అని రాహుల్‌ అన్నారు. యూపీలోని సొంత నియోజకవర్గంలో పర్యటిస్తున్న ఆయన విూడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. మాయావతి, అఖిలేశ్‌తో తనకు ఎటువంటి శత్రుత్వం లేదని ఆయన తెలిపారు. నిజానికి వారిద్దరూ అంటే చాలా గౌరవం అని అన్నారు.