నీటిప్లాంట్లతో జోరుగా వ్యాపారం

సిరిసిల్ల,జూన్‌20(జ‌నం సాక్షి): రాజన్న సిరిసిల్ల జిల్లాలో తాగునీటికి తీవ్ర ఎద్దడి నెలకొనడంతో కరవులోనూ కొందరు వ్యాపారులు శుద్ధజలం పేరిట సొమ్ముచేసుకున్నారు. ఉన్నతాధికారుల పర్యవేక్షణ కొరవడటంతో మూడు పువ్వులు ఆరు కాయలుగా నీటిదందా కొనసాగుతోంది. నీటిశుద్ధి కేంద్రాల ఏర్పాటులోనిర్వాహకులు నిబంధనలు పాటించడం లేదు. ఇళ్ల సవిూపంలోనే గొట్టపుబావులను తవ్విస్తూ అనుమతులు లేకుండానే కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. జిల్లాలో ఇప్పటికే వందలాది నీటిశుద్ధికేంద్రాలు ఏర్పాటు చేశారు. సాంకేతిక పరిజ్ఞానం ఉన్న వ్యక్తి పర్యవేక్షణలో వివిధ రసాయనాలను కలిపి నీటిని శుద్ధి చేయాల్సి ఉండగా అవేవిూ పట్టించుకోవడం లేదు. ఫలితంగా నీటిలో ఉండే ఖనిజలవణాలు, పోషకాలు పూర్తిగా తొలగిపోతున్నాయి. ఇలాంటి నీరు తాగడంతో కొద్ది రోజులకే ఎముకలు, కీళ్ళ సంబంధిత వ్యాధులు సోకుతాయని నిపుణులు పేర్కొంటున్నారు. ఈ నీటిని తాగిన ప్రజల ఆరోగ్యం మెరుగుపడకపోగా మరింత క్షీణించే పరిస్థితి నెలకొంటుందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇళ్లలో వినియోగం ఎక్కువగా ఉండటంతో పాటు శుభకార్యాలు ఎక్కువగా జరిగే ప్రస్తుత వేసవిలో సాంకేతికకు తిలోదకాలు ఇస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. కొందరు చల్లని నీటి పేరుతో మరింతగా సొమ్ముచేసుకుంటున్నారు. చల్లని నీటి క్యాన్‌కు రూ.20నుంచి రూ.40వరకు వసూలు చేస్తున్నారు. వాటర్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేయాలంటే సంబంధిత పురపాలక, నగరపాలక సంస్థలతోపాటు గ్రామ పంచాయతీ, వాణిజ్య పన్నులు, రెవెన్యూ, ఆహార నియంత్రణశాఖ, భూగర్భజలవనరుల శాఖ నుంచి అనుమతులు తీసుకోవాలి. చాలామంది నిర్వాహకులు పన్నులను ఎగ్గొట్టడంతో ప్రభుత్వ ఖజానాకు చిల్లు పడుతుంది. ఇంత జరుగుతున్నా అధికారులు చర్యలు తీసుకోవడం లేదు.