నీటి లభ్యత ఉన్నా చిత్తశుద్ది లోపం 

నీటి యుద్దాలు భారత్‌లోనూ తప్పేలా లేవు. మనకు నీటి లభ్యత ఉన్నా వాటిని సక్రమంగా వినియోగించు కోవాలన్న ధ్యాస లేదా చిత్తశుద్ది కానరావడం లేదు. అనేక జీవనదులు ఉన్నాయి. అవన్నీ సముద్రం పాలవుతున్నాయి. ఏటా లక్షల క్యూసెక్కులు వృధౄగా పోతున్నాయి. ఈ నదుల నీటిని మల్లించి, అనుసంధానం చేసే ప్రక్రియ చేపట్టి ఉంటే ఇవాళ నీటి సమస్యలు వచ్చేవి కావు. ఇందుకు బృహత్తర ప్రణాళిక రచిస్తామన్నప్రధాని మోడీ తన ఐదేళ్ల పదవీ కాలంలో దీనిపై ఒక్క అడుగు కూడా వేయలేక పోయారు. దేశంలో నీటికోసం యుద్ధాలు జరుగుతున్నాయి. రాష్ట్రాలు, ప్రాంతాలమధ్య జలవివాదాలు నెలకొంటున్నాయి. పర్యావరణ పరిరక్షణ.. నీటి వనరుల పొదుపు పట్ల ప్రజల్లో అవగాహన కోసం నిరంతర ప్రచారోద్యమం సాగుతున్నా.. తాగునీటికి ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. తాజాగా ఉపగ్రహాలు పంపిన చిత్రాలు.. అంచనా వేసిన దానికంటే ముందే భారత దేశంలో తాగునీటికి కటకట ఏర్పడుతుందని హెచ్చరిస్తున్నాయి. ఉపగ్రహాలు పంపిన చిత్రాల ఆధారంగా అమెరికాకు చెందిన నీటి వనరుల సంస్థ (డబ్ల్యూఆర్‌ఐ) ప్రపంచవ్యాప్తంగా నీటి కొరతపై అధ్యయనం జరిపింది.  ఇదే సందర్భంలో అమెరికా సంస్థ చేసిన హెచ్చరిక మనదేశంలో నీటి కటకటలకు అద్దం పడుతోంది. అంటే పాలకుల వైఫల్యం కారణంగా నీటిని సంరక్షించుకోలేకపోతున్నాం. దీని ప్రకారం భారతదేశంతో పాటు దక్షిణాఫ్రికా,మొరాకో,ఇరాక్‌, స్పెయిన్‌ తదితర దేశాల్లో తీవ్రమైన తాగునీటి కొరత పరిస్థితులు తలెత్తాయి. నీటి వినియోగంలో నిర్లక్ష్యం, వృథాగా నీటిని వదిలేయడం.. భారతదేశంలోని రిజర్వాయర్లు, డ్యామ్‌లు పూర్తిగా అడుగంటడంతోపాటు భూతాపం పెరుగుదలకు కారణమవుతున్నదన్న విమర్శ వినిపిస్తున్నది. గుజరాత్‌, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల మధ్య ప్రవహిస్తున్న నర్మదా నదిపై నిర్మించిన రెండు రిజర్వాయర్ల నుంచి నీటి కేటాయింపుల తీరుపై ఆయా రాష్ట్రాల ప్రజల మధ్య ఉద్రిక్తతలు తలెత్తే ముప్పు పొంచి ఉన్నదని ఈ అధ్యయనం హెచ్చరించింది. గుజరాత్‌లో నిర్మించిన సర్దార్‌ సరోవర్‌ డ్యామ్‌ దిగువన నీటి నిల్వలు పడిపోవడంతో ఆందోళనలు వ్యక్తమయ్యాయి. దీని పరిధిలోని మూడు కోట్ల మందికి పైగా ప్రజలకు తాగునీటిని సరఫరా చేయాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో సర్దార్‌ సరోవర్‌ డ్యామ్‌ పరిధిలోని రైతులంతా పంటలు సాగు చేయొద్దని కోరిన గుజరాత్‌ ప్రభుత్వం.. గత నెలలో సాగునీటి సరఫరాను నిలిపివేసింది. వర్షాభావ పరిస్థితులతో మధ్యప్రదేశ్‌ లోని ఇందిరాసాగర్‌ డ్యామ్‌లో నీటి నిల్వలు సీజనల్‌ స్థాయి కంటే తక్కువగా ఉన్నాయి.వర్షాభావంతో మొరాకోలో గల రెండో అతిపెద్ద రిజర్వాయర్‌ అల్‌ మాస్సిరా రిజర్వాయర్‌లో నీటి నిల్వలు 60 శాతానికి పైగా తగ్గిపోయాయి. అల్‌ మస్సిరా రిజర్వాయర్‌ పొరుగున ఉన్న కాసాబ్లాంకా వంటి నగరాల పరిధిలో పంటల సాగు విస్తీర్ణం పెంచడం కూడా ఈ దుస్థితి కారణాల్లో ఒకటి. మరోవైపు ఐదేండ్లుగా వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొంటున్న స్పెయిన్‌లోని బెండియా డ్యామ్‌లో 60 శాతం నీటి నిల్వలు తగ్గాయి. తక్కువ వర్షపాతం నమోదు కావడంతో ఇరాక్‌లోని మోసుల్‌ డ్యామ్‌ 1990 నాటి నీటి నిల్వలతో పోలిస్తే 60 శాతం నీటినిల్వలు తగ్గాయి. ఈ నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాలు మెరుగైన నీటి నిర్వహణ యాజమాన్య పద్ధతులను అమలు పరుచాలని, అవసరమైన మౌలిక వసతులను కల్పించాలని నిపుణులు సూచిస్తున్నారు. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా ఐదు లక్షల రిజర్వాయర్లలో నీటి నిల్వలు రికార్డు స్థాయిలో పతనమయ్యాయి. దక్షిణాఫ్రికాలో వరుసగా మూడేండ్లుగా కరువు పరిస్థితులు ఏర్పడటంతో ఆ దేశంలోని లక్షల మంది ప్రజలు తాగునీటి కోస అల్లాడుతున్నారు. ఇటీవలే కేప్‌టౌన్‌లో తాగునీటి కొరత ఉన్నదని అధికారికంగా ప్రకటించారు. ఇక మనదేశంలో ఇప్పుడు కావేరీ వివాదం, గోదావరి వివాదం, కృష్ణా వివాదం
సాగుతోంది. నీటి లభ్యత ఉన్నా నిర్వహణా లోపం కొట్టొచ్చినట్లుగా ఉంది. ఈ పరిస్థితికి కారణమెవరు? దేశంలో జలజగడాలు తీవ్రమవుతున్న తరుణంలో దేశంలో 70వేల టీఎంసీల నీటి లభ్యత ఉందని, కానీ సాగవుతున్న భూమి 40 కోట్ల ఎకరాలు మాత్రమే ఉందని లెక్కుల తేల్చాయి. ఇటీవల పార్లమెంట్‌ ఎన్నికల ప్రచారంలో తెలంగాణ సీఎం కేసీఆర్‌ పదేపదే ఇదే ప్రచారం చేశారు. దీనికంతటికి ముందు చూపు లేకపోవడమే అన్నారు. వర్షాకాలంలో 25-30 కోట్ల ఎకరాల్లోనే మొదటి పంట పండిస్తున్నారని, రెండో పంట సాగువిస్తీర్ణం ఐదారుకోట్ల ఎకరాలకు పరిమితమవుతున్నదని గణాంకాలు చెబుతున్నాయి.  దేశంలో ప్రతి ఎకరాకు నీరు అందించినా.. 30 వేల టీఎంసీల నీరు మిగులుతుందని, అయినా ఏడు దశాబ్దాలుగా సాగునీటి కోసం కష్టపడుతూనే ఉన్నాం. చైనాలో యాంగ్జీ నది నుంచి 2400 కి.విూ.దూరంలోని ఉత్తర చైనాకు 1600 టీఎంసీల నీటిని తరలించి, ఆ ప్రాంత అవసరాలు తీరుస్తున్నారు. అటువంటి ప్రయత్నం మనదేశంలో ఎందుకు జరుగడంలేదని  కెసిఆర్‌ తాజాగా  ప్రశ్నించారు. నదుల అనుసంధానంపై ఆర్భాటంగా ప్రకటన చేసిన ప్రధాని మోడీ దానిపై ఎలాంటి కార్యాచరణా ప్రకటించలేదు. సంకల్పం లేకపోవడం వల్ల నీటి సమస్యలు వస్తున్నాయి. కెసిఆర్‌ అన్నట్లుగా వీటిని ఒడిసిపట్టుకునే ప్రయత్నం చేయాలి. భగీరథ ప్రయత్నంతో పాటు నదుల అనుసంధానం జరగాలి. అప్పుడే దేశంలో కరువు కాటకాలను పారదోలవచ్చు.