నేటితో మూతపడనున్న శబరిమల అయ్యప్ప ఆలయం

తిరువనంతపురం,డిసెంబర్‌27(జ‌నంసాక్షి): శబరిమల అయ్యప్ప స్వామికి శుక్రవారంతో మండల పూజలు పూర్తవుతాయి. దీంతో మూడు రోజుల పాటు ఆలయ తలుపులు మూసుకోనున్నాయి. మకరజ్యోతి సందర్భంగా తిరిగి ఈ నెల 30 న ఆలయాన్ని తెరుస్తామని కమిటీ తెలిపింది. జనవరి 15 న జ్యోతి దర్శనం ఉంటుందని జనవరి 21 న ఆలయం తలుపులు మూసివేస్తామని అధికారులు స్పష్టం చేశారు. ఆలయానికి ఈ సంవత్సరం కనీవినీ ఎరుగని రీతిలో ఆదాయం లభించింది. గత నెల 16 న మండల పూజల సందర్భంగా అయ్యప్పస్వామి ఆలయం తలుపులు తెరుచుకోగా ఇప్పటికి రూ.156 కోట్ల ఆదాయం వచ్చిందని ట్రావెన్‌కోర్‌ దేవస్థానం తెలిపింది. గత ఏడాది ఇదే సీజన్‌లో రూ.105.29 కోట్ల మేర ఆదాయం వచ్చింది. శబరిమలలో భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది. స్వామి వారి దర్శనార్థం భక్తులు భారీగా తరలివస్తున్నారు. స్వామి దర్శనార్థం ఆన్‌లైన్‌లో ముందస్తుగా రిజర్వ్‌ చేసుకున్నవారికి 4 గంటలకుపైగా, రిజర్వ్‌ చేసుకోనివారికి 6 నుంచి 8 గంటల సమయం పడుతోంది. పవిత్ర పంపాలో మోకాళ్లకన్నా తక్కువ లోతుకు నీరు ఉండడంతో భక్తులు స్నానాలు ఆచరించేందుకు తీవ్ర అవస్థలు పడుతున్నారు.