నేటినుంచి ఓపెన్‌ స్కూల్‌ పరీక్షలు 

ఖమ్మం,ఏప్రిల్‌22(జ‌నంసాక్షి): తెలంగాణ రాష్ట్ర ఓపెన్‌ స్కూల్‌ పరిధిలో ఈ నెల 24వ తేదీ నుంచి నిర్వహించే టెన్త్‌, ఇంటర్‌ పబ్లిక్‌ పరీక్షల నిర్వహణకు పకడ్బందీగా ఏర్పాట్లు చేశామని డీఆర్‌ఓ శిరీష తెలిపారు. పరీక్షల నిర్వహణకు జిల్లా కేంద్రంలో పదవ తరగతికి ఆరు కేంద్రాలు, ఇంటర్‌కు 5 కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఈ నెల 24వ తేదీ నుంచి మే 9వ తేదీ వరకు ఉదయం 8.30 గంటల నుంచి మధ్యాహ్నం 11.30 గంటల వరకు పరీక్షలు జరుగుతాయని అన్నారు. పరీక్షల నిర్వహణకు సిట్టింగ్స్‌ స్కాడ్స్‌గా రెవెన్యూ శాఖ నుంచి ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. పరీక్షల సమయంలో బస్సులు అందుబాటులో ఉంచాలని, వైద్య సిబ్బందిని ఉంచాలని ఆదేశించారు.  ప్రాక్టికల్‌ పరీక్షలు మే 10వ తేదీ నుంచి మే 14వ తేదీ వరకు నయాబజార్‌ ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో నిర్వహించేలా ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు. ఇంటర్‌ పరీక్షలకు రెగ్యులర్‌ విద్యార్థులు 795 మంది, సప్లమెంటరీ విద్యార్థులు 345 మంది హాజరుకానున్నట్లు, టెన్త్‌కి రెగ్యులర్‌లో 1026, సప్లమెంటరీలో 383 మంది హాజరవుతున్నారన్నారు.