నేటినుంచి మావోయిస్టుల అమరవీరుల వారోత్సవాలు

 

 

 

ఏజెన్సీలో అప్రమత్తమైన పోలీసులు

ఖమ్మం,జూలై26(జ‌నంసాక్షి: అమరవీరుల వారోత్సవాలను పురస్కరించుకొని ఏజెన్సీలో భద్రతను కట్టుదిట్టం చేశారు. అలాగే ఇటీవల అడపాదడపా జరుగుతున్న ఘటనల నేపథ్యంలో అప్రమత్తం అయ్యారు. అలాగే స్థానికంగా ఉండే నేతలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని పోలీసులు సూచించారని సమాచారం. 27నుంచి ఆగస్టు 2వరకు ప్రతి ఏటా పీపుల్స్‌ లిబరేషన్‌ ఆఫ్‌ గెరిల్లా ఆర్మీ (పీఎల్‌జీఏ) వారోత్సవాలను నిర్వహిస్తున్నారు. ఈ సమయంలో వారు అమరులకు నివాళ్లర్పించడంతో పాటు అంతర్గతంగా సమావేశాలు నిర్వహించి భవిష్యత్‌ పోరాటాలపై చరిస్తారని సమాచారం. ఈ క్రమంలో ఏజెన్సీ ప్రాంతంలో తమపట్టును చాటేందుకు దాడులకు దిగే అవకాశాలు ఉన్నాయని నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. అమరవీరుల వారోత్సవాల నేపధ్యంలో ఏజెన్సీలో మావోయిస్టుల టార్గెట్‌గా ఉన్న ప్రజా ప్రతినిధులు, వివిధ రాజకీయపక్షాల నాయకులను సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని పోలీసు అధికారులు ఇప్పటికే సూచించారు. దాంతో వారంతా సురక్షిత ప్రాంతాలకు వెళ్లారు. పోలీసుల ఎదుట లొంగిపోయిన మావోయిస్టులు సైతం సురక్షిత ప్రాంతాల వైపు తరలివెళ్లినట్లు సమాచారం. ఇక ఏజెన్సీ ప్రాంతాల్లో రహదారి పనులు చేపడుతున్న వారిని ముందస్తుగా హెచ్చరించి వారి వాహనాలు, పరికరాలను సైతం తీసుకెళ్లాలని సూచించినట్లు తెలుస్తోంది. దీంతో ఏజెన్సీ ప్రాంతంలో పనులు చేపడుతున్న కాంట్రాక్టర్లు తాత్కాలికంగా పనులకు బ్రేక్‌ ఇచ్చారు. పూర్తిగా ఏజెన్సీ ప్రాంతాలతో కూడిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మావోయిస్టుల కదలికలు తరచూ కనిపిస్తున్నాయి. ఏజెన్సీకి సరిహద్దున ఆంధప్రదేశ్‌-చత్తీస్‌గఢ్‌ రాష్ట్రాలు ఉండటం మావోయిస్టుల కదలికలు అధికంగా ఉండటానికి కారణం. ఈ నేపధ్యంలో మావోయిస్టుల అమరవీరుల వారోత్సవాలను పురస్కరించుకొని అవాంచనీయ సంఘటనలు జరిగే అవకాశం ఉందని ఏజెన్సీ వాసులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా చింతూరు మండలంలోని సరివెల నుంచి పేగ వెళ్లే మార్గంలో రహదారి నిర్మాణానికి వినియోగిస్తున్న సామగ్రిని మావోయిస్టులు కాల్చిన ఘటన కలకలం రేపింది. ఇక తాజాగా చర్ల మండలంలోని కుర్నపల్లి అడవుల్లో శబరి

ఏరియా కమిటీ ఇన్‌చార్జ్‌, దళసభ్యుడు సుంకరి రాజ్‌కుమార్‌ అలియాస్‌ అరుణ్‌ పోలీసుల ఎదురు కాల్పుల్లో మృతి చెందడంతో ఏజెన్సీలో ఒక్కసారిగా వాతావరణం వేడెక్కింది. బుధవారం చర్ల మండలంలోని కొండవాయి కి చెందిన మిలీషియా సభ్యురాలు ముష్కిరామి అనే యువతి పేలుడు పదార్థాలు తీసుకెళ్తుండగా పోలీసులు చర్లలో పట్టుకున్నారు. ఈ ఘటనల నేపధ్యంలో మరో 24గంటల్లో మావోయిస్టుల అమరవీరుల వారోత్సవాలు ప్రారంభం కానుండడంతో ఏజెన్సీ గ్రామాల్లో అలజడి రేగుతోంది. ఏ క్షణాన ఏం జరుగుతుందోని ఏజెన్సీ వాసులు భ యాందోళన చెందుతున్నారు. గతంలో నిర్వహించిన అమరుల వారోత్సవాల సమయం లో ప్రధానంగా భద్రాచలం ఏజెన్సీలో మావోయిస్టులు విధ్వంసాలకు పాల్పడిన నేపధ్యంలో ఈసారి పరిస్థితి ఏరీతిన ఉంటుందోనన్న ఆందోళన అధికమైంది. దీంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు.

————