నేటినుంచి రైతుబంధు నగదు బదిలీ

నేరుగా బ్యాంక్‌ ఖాతాల్లోకి చెక్కులు
ఆదిలాబాద్‌,అక్టోబర్‌20(జ‌నంసాక్షి): రైతు బంధు పథకం ద్వారా యాసంగి సాగుకు పెట్టుబడి సాయం అందించేందుకు వ్యవసా యశాఖ అధికారులు రైతుల బ్యాంక్‌ ఖాతా వివరాలను సేకరిస్తున్నారు. ఈనెల 21నుంచి 13వేల మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో పెట్టుబడి సాయం జమకానుంది. ఇప్పటి వరకు 38 వేల మంది రైతుల బ్యాంకు ఖాతాల వివరాలను సేకరించిన సిబ్బంది 5266 మంది రైతుల బ్యాంకు ఖాతా వివరాలను ఆన్‌లైన్‌లో పొందుపరిచారు.  విడతల వారీగా పెట్టుబడి సాయం బ్యాంకు ఖాతాల్లో జమవుతుందని జిల్లా వ్యవసాయాధికారి ఆశాకుమారి అన్నారు. ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కమిషన్‌ రైతుబంధు పథకంపై కొన్ని షరతులు విధించింది. సభలు, సమావేశాలను నిర్వహించి చెక్కులను పంపిణీ చేయొద్దని, నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో పెట్టుబడిసాయం జమ చేయాలని నిబంధనల్లో పేర్కొంది. ఈ మేరకు వ్యవసాయశాఖ అధికారులు రైతుల బ్యాంక్‌ ఖాతా వివరాలను సేకరిస్తున్నారు. అర్హులైన వారి వివరాలను ముందుంగా పొందుపరిచారు. మొదటివిడతలో ఖాతాల్లోకి నగదు బదిలీ చేసే కార్యక్రమం చేపట్టారు.