నేటి నుంచి సీపీఎం జాతీయ సభలు

హైదరాబాద్ : రానున్న కాలంలో అనుసరించాల్సిన రాజకీయ వ్యూహంపై మహాసభలోనే చర్చించి తుది నిర్ణయం తీసుకోవాలని సీపీఎం పొలిట్‌బ్యూరో నిర్ణయించినట్లు తెలిసింది. దేశ రాజకీయాల్లో తిరిగి ప్రాధాన్యం పొందేందుకు అనుసరించాల్సిన రాజకీయ వ్యూహాన్ని ఈ మహాసభ ఖరారు చేయనుంది. కీలకంగా మారిన రాజకీయ తీర్మానంపై రెండు రకాల అభిప్రాయాలు ఉన్న నేపథ్యంలో మహాసభ తీసుకున్న నిర్ణయానికి ప్రాధాన్యం ఏర్పడింది. సీపీఎం 22వ మహాసభలు బుధవారం నుంచి హైదరాబాద్‌లో ప్రారంభం కానున్నాయి. ఈనెల 22న జరిగే భారీ బహిరంగ సభతో మహాసభలు ముగుస్తాయి. రానున్న కాలంలో అనుసరించాల్సిన రాజకీయ వ్యూహం, పార్టీ నిర్మాణంపై వీటిలో చర్చించనున్నారు. అజెండాను ఖరారు చేయడానికి మంగళవారం మొదట పొలిట్‌బ్యూరో సమావేశం, తర్వాత కేంద్ర కమిటీ సమావేశం జరిగాయి. పోలిట్‌బ్యూరో సమావేశంలో పార్టీ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, కేరళ ముఖ్యమంత్రి విజయన్‌, త్రిపుర మాజీ ముఖ్యమంత్రి మాణిక్‌ సర్కార్‌, పార్టీ మాజీ ప్రధాన కార్యదర్శి ప్రకాశ్‌కారాట్‌, బి.వి.రాఘవులు, బృందా కారాట్‌ తదితరులు పాల్గొన్నారు. అనంతరం 80 మంది సభ్యులతో కూడిన కేంద్ర కమిటీ సమావేశం జరిగింది. తెలుగురాష్ట్రాల నుంచి తమ్మినేని వీరభద్రం, పి.మధు, ఎం.ఎ.గఫూర్‌, వీరయ్య, శ్రీనివాసరావు, సీతారాములు తదితరులు పాల్గొన్నారు. గతంలో కేంద్రకమిటీ ఆమోదించిన రాజకీయ తీర్మానాన్నే మహాసభలో పెట్టాలని పొలిట్‌బ్యూరో నిర్ణయించినట్లు తెలిసింది. దీనికే కేంద్ర కమిటీ ఆమోదం తెలిపినట్లు తెలిసింది. తెలంగాణలో బి.ఎల్‌.ఎఫ్‌. బలోపేతంపై కూడా మహాసభలో చర్చిస్తామని పార్టీ తెలంగాణ శాఖ కార్యదర్శి, కేంద్ర కమిటీ సభ్యులు తమ్మినేని వీరభద్రం తెలిపారు. భాజపాను ఓడించడమే లక్ష్యమని, కాంగ్రెస్‌తో పొత్తుగానీ, అవగాహన కానీ ఉండవని స్పష్టం చేశారు.

ప్రధాని మోదీ పాలనలో దేశంలో మతోన్మాదం పెరిగిపోయిందని సీపీఎం పొలిట్‌ బ్యూరో సభ్యుడు రాఘవులు ఆందోళన వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లో జరుగుతున్న సీపీఎం 22వ జాతీయ మహాసభల్లో ఆహ్వానం సంఘం కన్వీనర్‌ హోదాలో రాఘువులు స్వాగతోపన్యాసం చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ అమలు చేస్తున్న సరళీకృత ఆర్థిక విధానాలపై విరుచుకుపడ్డారు. మతోన్మాదం చేశానికి ప్రమాదకరంగా పరిణమించిందని ఆందోళన వ్యక్తం చేశారు. బీజేపీ పాలనలో బలహీనవర్గాలకు రక్షణ కరువైందన్నారు. సీపీఎం 22వ జాతీయ మహాసభల్లో స్వాగతోపన్యాసం చేస్తూ… దేశంలో మహిళలు,బాలికలపై జరుగుతున్న అత్యాచారాలు, దళితులపై దాడులను ప్రస్తావించారు. ఇలాంటి దాడులు తెలుగు రాష్ట్రాల్లో తక్కువేమీ కాదన్నారు.

ప్రధాని మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం అనుసరిస్తున్న మతోన్మాద విధానాలు ప్రతిఘటించేందుకు ఐక్యపోరాటాలు అవసరమని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి పిలుపు ఇచ్చారు. హైదరాబాద్‌లో జరుగుతున్న సీపీఎం జాతీయ మహాసభల్లో సీతారాం ఏచూరి.. దేశంలో పెరిగిపోతున్న అత్యాచారాలు ఆందోళన వ్యక్తం చేశారు.

ప్రధాని మోదీ అనుసరిస్తున్న విభజించి పాలించు విధానాలతో దేశ ప్రజలు నడిరోడ్డు మీదకు నెట్టివేయబడ్డారని త్రిపుర మాజీ ముఖ్యమంత్రి మాణిక్‌ సర్కార్‌ విమర్శించారు. హైదరాబాద్‌లో జరుగుతున్న సీపీఎం జాతీయ సభలకు అధ్యక్షత వహించిన మాణిక్‌ సర్కార్‌… దేశ స్వాతంత్ర్యోద్యంలో ఏ రకమైన పాత్ర పోషించని బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ శక్తులు వినాశకర విధానాలకు తెరతీశాయని మండిపడ్డారు. ధనికులు, పేదల మధ్య ఆర్థిక తారతమ్యాలు పెరిగిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. స్వాతంత్ర్యానంతరం ఇలాంటి అభివృద్ధి నిరోధక శక్తులను చూడలేదని…బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌పై మాణిక్‌ సర్కార్‌ మండిపడ్డారు.

 ప్రధాని మోదీ పాలన దేశాన్ని వినాశనం వైపుగా తీసుకెళ్తోందని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి విమర్శించారు. మతోన్మాదంతో సర్వవ్యవస్థలను భ్రష్టుపట్టిస్తోందని మండిపడ్డారు. హైదరాబాద్‌లో జరుగుతున్న సీపీఎం జాతీయ మహాసభల ప్రారంభోత్సవానికి హాజరైన సురవరం… బీజేపీ సర్కారు విధానాలపై విరుచుకుపడ్డారు. మేధావులు, శాస్త్రవేత్తలు, రచయితలు, విద్యావేత్తలు, విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడుతోందన్నారు. దళితులపై దాడులు పెరిగిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు.

దేశంలో రోజు రోజుకు పెరిగిపోతున్న బీజేపీ ఫ్యాసిస్టు శక్తులను ప్రతిఘటించేందుకు బలమైన ప్రజా ఉద్యమాలు నిర్మించాలని సీపీఐ ఎంఎల్‌ నేత దీపాంకర్‌ భట్టాచార్య పిలుపు ఇచ్చారు. ఈ విషయంలో వామపక్షాలు కీలక పాత్ర పోషించాలన్నారు. హైదరాబాద్‌లో జరుగుతున్న సీపీఎం జాతీయ మహాసభల ప్రారంభోత్సవానికి హాజరైన దీపాంకర్‌.. ప్రధాని మోదీ విధానాలపై విరుచుకుపడ్డారు.

దేశ ప్రజల ఆశలు, ఆకాంక్షలను నెరవేర్చడంతో ప్రధాని మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఫార్వర్డ్‌ బ్లాక్‌ కార్యదర్శి జీఆర్‌ శివశంకర్‌ విమర్శించారు. ఏటా రెండు కోట్ల మందికి ఉద్యోగావకాశాలు కల్పిస్తానని గత ఎన్నికల్లో హామీ ఇచ్చిన మోదీ… అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగుల ఆశలు ఒమ్ము చేశారని మండిపడ్డారు. సీపీఎం 22వ జాతీయ మహాసభల ప్రారంభోత్సవానికి హాజరైన శివశంకర్‌… మోదీ విధానాలు దేశానికి నష్టదాయకంగా పరిణమించాయని విమర్శించారు.

హైదరాబాద్‌లోని ఆర్టీసీ కల్యాణ మండపంలో జరుగుతోన్న ఈ సభలకు సీపీఎం పొలిట్‌ బ్యూరో సభ్యులు బృందాకరత్‌ హాజరయ్యారు. మహిళలపైన జరుగుతోన్న దాడులను నివారించేందుకు ఈ మహాసభల్లో తీర్మానాలు చేస్తామంటున్న బృందాకరత్‌తో టెన్ టివి మాట్లాడింది. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి.