నేటి నుంచి ’35 ఎ’పై విచారణ

న్యూఢిల్లీ, ఫిబ్రవరి25(జ‌నంసాక్షి) : జమ్ముకశ్మీర్‌లోని స్థానికులకు ప్రత్యేక హక్కులు కల్పించే 35-ఎ అధికరణం చెల్లుబాటును సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సర్వోన్నత న్యాయస్థానం మంగళవారం నుంచి విచారణ చేపట్టనుంది. ఈ పిటిషన్లపై ఫిబ్రవరి 26 నుంచి 28 వరకు విచారణ జరపనున్నట్లు సుప్రీంకోర్టు సోమవారం వెల్లడించింది. జమ్ముకశ్మీర్‌లో శాశ్వత పౌరులను గుర్తించి, వారికి ప్రత్యేక హక్కులను కల్పించే అధికారాన్ని రాష్ట్ర అసెంబ్లీకి ఇచ్చేందుకు 35-ఎ అధికరణాన్ని రాజ్యాంగంలో చేర్చారు. దీని ద్వారా రాష్ట్ర శాసనసభ తీసుకునే ఏ నిర్ణయాన్ని సవాల్‌ చేయడానికి వీలు లేదు. శాశ్వత ¬దా ఉన్నవారు ప్రభుత్వ ఉద్యోగాలు పొందడానికి, రాష్ట్రంలో ఆస్తులు కొనుగోలు చేయడానికి, ఉపకార వేతనాలు, సంక్షేమపథకాలు పొందడానికి అర్హులు. 1954లో నాటి రాష్ట్రపతి రాజేందప్రసాద్‌ 35-ఎ అధికరణాన్ని రాజ్యాంగంలో చేరుస్తూ ఉత్తర్వులు జారీచేశారు. అయితే పార్లమెంట్‌ ఆమోదం లేకుండా రాష్ట్రపతి ఈ అధికరణాన్ని చేర్చడంపై వివాదం మొదలైంది. ఈ అధికరణం చెల్లుబాటును సవాల్‌ చేస్తూ కొందరు సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ప్రజల ఎన్నుకున్న నేతలతో పార్లమెంట్‌లో ఆమోదం పొందిన తర్వాత ఇది చట్టరూపం దాల్చాలని పిటిషనర్లు పేర్కొన్నారు. వీటిపై గతంలోనూ విచారణ జరిపిన సుప్రీంకోర్టు మంగళవారం నుంచి మరోసారి వాదనలు విననుంది.