నేడు ఐర్లాండ్‌కు కోహ్లీ సేన

 రెండు టీ20 మ్యాచ్‌లు ఆడనున్న భారత్‌
ముంబయి, జూన్‌22(జ‌నం సాక్షి ) : రెండు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌ కోసం కోహ్లీ సేన శనివారం భారత్‌ నుంచి బయల్దేరనుందని బీసీసీఐ ఓ ప్రకటన విడుదల చేసింది. ‘ఈ నెల 27, 29న ఐర్లాండ్‌తో టీమిండియా రెండు టీ20 మ్యాచ్‌లు ఆడనుంది. ఈ నేపథ్యంలో శనివారం కోహ్లీ నాయకత్వంలోని టీమిండియా ఐర్లాండ్‌ బయల్దేరనుంది. సిరీస్‌ ప్రారంభానికి నాలుగు రోజుల ముందుగానే టీమిండియా ఐర్లాండ్‌ చేరుకోనుంది’ అని బీసీసీఐ అధికారులు పేర్కొన్నారు. సిరీస్‌ ముగిసిన అనంతరం ఐర్లాండ్‌ నుంచి నేరుగా భారత ఆటగాళ్లు ఇంగ్లాండ్‌ పయనమవ్వనున్నారు. జులై 3 నుంచి భారత్‌-ఇంగ్లాండ్‌ మధ్య టీ20 సిరీస్‌ ప్రారంభంకానుంది. ఆ తర్వాత వన్డే, టెస్టు సిరీస్‌లు జరగనున్నాయి. సెప్టెంబరులో ఇంగ్లాండ్‌లో భారత్‌ పర్యటన ముగియనుంది’ అని అధికారులు తెలిపారు. గతంలో ధోనీ నాయకత్వంలోని భారత జట్టు ఇంగ్లాండ్‌లో పర్యటించినప్పుడు 1-3తో టెస్టు సిరీస్‌ను కోల్పోయింది. మరి ఇప్పుడు కోహ్లీ సేన ఇంగ్లిష్‌ గడ్డపై టెస్టు సిరీస్‌ గెలుస్తుందో లేదో చూడాలి.
కోహ్లీ సేనతో తలపడే ఐర్లాండ్‌ జట్టిదే..
కోహ్లీ సేనతో తలపడే ఐర్లాండ్‌ జట్టును ఆ దేశ క్రికెట్‌ బోర్డు ప్రకటించింది. త్వరలో రెండు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌ కోసం టీమిండియా ఐర్లాండ్‌లో అడుగుపెట్టనుంది. ఈ నెల 27, 29న ఈ మ్యాచ్‌లు జరగనున్నాయి. ఇందుకోసం ఇప్పటికే బీసీసీఐ కోహ్లీ నాయకత్వంలోని జట్టును ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా ఐర్లాండ్‌ కూడా 14మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది. గ్యారీ విల్సన్‌ ఐర్లాండ్‌ జట్టుకు నాయకత్వం వహించనున్నాడు. డుబ్లిన్‌లోనే ఈ రెండు మ్యాచ్‌లు జరగనున్నాయి.గ్యారీ విల్సన్‌ (కెప్టెన్‌), ఆండ్రూ బాల్‌బిర్ని, పీటర్‌ చేజ్‌, జార్జ్‌ డాక్‌రెల్‌, జాష్‌ లిటిల్‌, ఆండ్రూ మెక్‌బైన్ర్‌, కెవిన్‌ ఓబ్రియన్‌, విలియమ్‌ పోర్టర్‌ఫీల్డ్‌, స్టువర్ట్‌ పోయంటర్‌, బోయడ్‌ రాన్‌కిన్‌, జేమ్స్‌ షన్నాన్‌, సిమి సింగ్‌, పాల్‌ స్టిర్లింగ్‌, స్టువర్ట్‌ థాప్సన్‌ లు ఉన్నారు.