నేడు కెసిఆర్‌ పాలమూరు పర్యటన

ఎత్తి పోతల పథకం ప్రత్యక్ష పర్యవేక్షణ
భారీగా ఏర్పాట్లు చేస్తున్న అధికారులు
హైదరాబాద్‌,ఆగస్ట్‌28 (జనంసాక్షి): గురువారం 28న ఉమ్మడి మహబూబ్‌ నగర్‌ జిల్లాలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ పర్యటించనున్నారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంతో పాటు పెండింగ్‌ లో ఉన్న పలు ప్రాజెక్టులను పరిశీలించనున్నారు. కరివెన, వ్టటెం, ఏదులాపూర్‌ రిజర్వాయర్లు, నార్లపూర్‌ పంప్‌ హౌజ్‌
పనులను పర్యవేక్షించనున్నారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంతో పాటు ఉమ్మడి మహబూబ్‌నగర్‌ లోని పెండింగ్‌ ప్రాజెక్టుల పనులపై అధికారులతో సీఎం కేసీఆర్‌ సవిూక్ష జరుపనున్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టు తరహాలో పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులను శరవేగంగా పూర్తి చేసేలా ముఖ్యమంత్రి కేసీఆర్‌  జిల్లాలో పర్యటిస్తారని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు తాగునీరు, రైతులకు సాగునీరు అందించడానికి ప్రాజెక్టుల నిర్మాణం చేపడుతున్నామన్నారు. కొల్లాపూర్‌ మండలంలోని ఎల్లూరు, నార్లాపూర్‌ గ్రామాల్లో జరుగుతున్న పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులను చూశారు. గతంలో పాలకవర్గాల నిర్లక్ష్యం వల్ల ప్రాజెక్టులు నిర్మించుకోలేకపోయామని, వరద జలాలను పూర్తిస్థాయిలో వాడుకోలేక పోయామని పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చాక కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చూసి ప్రజలు విశ్వసిస్తున్నారని, అదేవిధంగా పాలమూరు పథకం పనులను శరవేగంగా జరిపించడానికి సీఎం పరిశీలనకు వస్తున్నారని అన్నారు. ఏదుల, వ్టటెం జలాశయాలు నిర్మాణం వేగంగా జరుగుతుండగా.. అంజనగిరి, కర్వెనా జలాశయాల పనులు నత్తనడకన సాగుతున్నాయన్నారు. రోజుకు 2 టీఎంసీల నీటిని వాడుకొనే విధంగా ఈ ప్రాజెక్టు నిర్మాణం జరుగుతోందని చెప్పారు. 3 వేల చెరువులను వరద జలాలతో నింపడానికి సర్వే చేయిస్తున్నామని తెలిపారు. పాలమూరు ఎత్తిపోతల పథకం ద్వారా ఉమ్మడి జిల్లాలో 20 లక్షల ఎకరాలకు సాగునీరు అందించి సస్యశ్యామలం చేస్తామన్నారు.