నేడు కొత్త జిల్లాల శకం ఆరంభం

596

– సిద్ధిపేట జిల్లాను ఆపరంభించనున్న సీఎం కేసీఆర్‌

హైదరాబాద్‌,అక్టోబర్‌ 10(జనంసాక్షి): తెలంగాణాలో కొత్త జిల్లాల ఆవిర్భావానికి ముహూర్తం ఖరారు కావడంతో పాటు ఎవరెక్కడ పాల్గొంటారన్నది కూడా ప్రభుత్వం స్పష్టం చేసింది. సిఎం కెసిఆర్‌ సిద్దిపేటలో పాల్గొంటారు. ఈ మేరకు  ముఖ్యమంత్రి కేసీఆర్‌ మంగళవారం సిద్దిపేటలో పర్యటించనున్నారు. విజయ దశమి సందర్భంగా రాష్ట్రంలో 21 నూతన జిల్లాలను ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈమేరకు కర్కాటక లగ్నంలో జిల్లాలకు సంబంధించిన నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నారు. రేపు ఉదయం ధనుర్‌ లగ్నంలో 11.13 నిమిషాలకు జిల్లాలు ముఖ్యమంత్రి, మంత్రుల చేతుల విూదుగా కొత్త జిల్లాలు ప్రారంభంకానున్నాయి. ఈమేరకు జిల్లాలు వాటిని ప్రారంభించబోయే మంత్రుల వివరాలు.. ఉదయం 11.13 నిమిషాలకు సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు సిద్దిపేట జిల్లాను ప్రారంభిస్తారు. ఆయన వెంట మంత్రి హరీష్‌రావు ఉంటారు. ఈ నేపథ్యంలో అధికారులు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఏర్పాట్లను మంత్రి హరీశ్‌రావు  సోమవారం పరిశీలించారు. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా సిద్దిపేటలో భారీ ర్యాలీ నిర్వహించనున్నారు. కలెక్టరేట్‌ నుంచి పాతబస్టాండ్‌ వరకు ఈ ర్యాలీ కొనసాగనుంది. ఉదయం 11.12 గంటలకు సిద్దిపేట జిల్లా కేంద్రాన్ని సీఎం ప్రారంభించనున్నారు.  ఈమేరకు పోలీసు యంత్రాంగం కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాట్లు చేస్తోంది. సీఎం రాక సందర్బంగా ఏర్పాట్లను మంత్రి హరీష్‌రావు దగ్గరుండి చూసుకుంటున్నారు. సీఎం రాక సందర్భంగా ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ర్యాలీ నిర్వహించేందుకు పార్టీ శ్రేణులు ఏర్పాట్లు చేస్తున్నాయి. దీంతో పాటు  ములుగు మండలం మర్కుక్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ పర్యటించనున్నారు. మర్కుక్‌ గ్రామాన్ని రాష్ట్ర ప్రభుత్వం మండల కేంద్రంగా ప్రకటించింది. మర్కుక్‌లో ప్రభుత్వ భవనాలను ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు. తహసీల్దార్‌, పోలీస్‌స్టేషన్‌, ప్రభుత్వ ఆసుపత్రిని సీఎం ప్రారంభిస్తారు. జాయింట్‌ కలెక్టర్‌ వెంకట్రామిరెడ్డి సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించారు. ఇదిలావుంటే ప్రారంభించే జిల్లాలు-మంత్రుల వివరాలు ఇలా ఉన్నాయి. వరంగల్‌ (రూరల్‌)- డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, యాదాద్రి – నాయిని నర్సింహరెడ్డి, పెద్దపల్లి – ఈటల రాజేందర్‌,కామారెడ్డి – పోచారం శ్రీనివాస్‌ రెడ్డి,మెదక్‌ – డిప్యూటీ స్పీకర్‌ పద్మా దేవేందర్‌రెడ్డి, మంచిర్యాల – పద్మారావు, వికారాబాద్‌ – మహేందర్‌రెడ్డి,సిరిసిల్ల (రాజన్న) – కల్వకుంట్ల తారక రామారావు,ఆసిఫాబాద్‌ – జోగు రామన్న,జనగామ – మండలి ఛైర్మన్‌ స్వామిగౌడ్‌,జయశంకర్‌ – స్పీకర్‌ మధుసూధనాచారి, జగిత్యాల – డిప్యూటీ సీఎం మహమూద్‌ ఆలీ,సూర్యాపేట – జగదీష్‌రెడ్డి,కొత్తగూడెం – తుమ్మల నాగేశ్వర్‌రావు, నిర్మల్‌ – ఇంద్రకరణ్‌రెడ్డి,నాగర్‌ కర్నూలు – జూపల్లి కృష్ణారావు,మహబూబాబాద్‌ – చందూలాల్‌,జోగులాంబ – లక్ష్మారెడ్డి,మేడ్చల్‌ (మల్కాజిగిరి) – తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, వనపర్తి – ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్‌రెడ్డి, కొత్తగూడెం – తుమ్మల నాగేశ్వర్‌రావులు ప్రరాంభిస్తారు. ఈ మేరకు ఆయా జిల్లాల కలెక్టర్లు పర్యవేక్షిస్తున్నారు.