నేడు గోదావరిలో స్వామికి తెప్పోత్సవం

భారీగా హాజరు కానున్న భక్తులు
భద్రాచలం,డిసెంబర్‌17(జ‌నంసాక్షి): ముక్కోటి సందర్భంగా భద్రాద్రిలో తెప్పోత్సవ వేడుకలను
ఘనంగా నిర్వహించనున్నారు. సాయంత్రం 4గంటల సమయంలో స్వామివారిని హంస వాహనంపై అధిరోహింప చేసి అర్చక స్వాములు ప్రత్యేక పూజలు జరుపుతారు. హంస వాహనంపై శ్రీ సీతారామచంద్రస్వామివారు ఐదు సార్లు గోదావరిలోప్రదక్షిణలు చేస్తారు. ఈ అద్భుత సన్నివేశాన్ని భక్తులు కనులారా తిలకించేందుకు అధికారులు తగు ఏర్పాట్లు చేశారు. గోదావరి తీరం వెంబడి  బారికేడ్లను నిర్మించారు. కరకట్ట ప్రాంగణం మెట్లపై భక్తులు కూర్చొని ఈ వేడుకను కనులారా తిలకించేందుకు ఏర్పాట్లు జరిగాయి. విద్యుత్‌ లైట్లను ఏర్పాటు చేశారు. స్వామివారి తెప్పోత్సవం జరుగుతున్న సమయంలో పెద్ద ఎత్తున బాణాసంచ కాల్చుతారు. ఇవి భక్తులను ఎంతగానో ఆకట్టుకుంటాయి. ఈ అపురూప వేడుకను వీక్షించేందుకు దేశ నలుమూలల నుంచి భక్తులు భద్రాద్రికి చేరుకుంటున్నారు. స్వామివారి తెప్పోత్సవం, ముక్కోటి వేడుకకు దాదాపు 2లక్షల మందికి పైగా భక్తులు హాజరవుతారని అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే తుఫాన్‌ ప్రభావం ఈ వేడుకలపై ఈ సారి కాస్త ప్రభావం చూపే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఉదయం 5గంటలకు ఉత్సవ మూర్తులను బేడా మండపం వద్దకు తీసుకొస్తారు. తిరుప్పావై విన్నపం చేస్తారు. ఆండాళ్‌ అమ్మతల్లికి తిరువీధిసేవ నిర్వహిస్తారు. ఉదయం 10.30నిమిషాలకు తిరుమంగైళ్వార్‌ పరమ పదోత్సవం ఘనంగా జరుపుతారు. మధ్యాహ్నం 1గంట సమయంలో శరణాగతి మోక్షం నిర్వహిస్తారు. 3గంటలకు దర్భార్‌ సేవ జరిపి స్వామివారిని పల్లకీపై ఊరేగింపుగా భక్తుల కోలాట నృత్య ప్రదర్శనలు, మేళతాళాలు, భాజాభజంత్రీల సందడి నడుమ గోదావరి తీరానికి తీసుకొస్తారు.