నేడు భోగి..

‘భగ’ అనే పదం నుంచి ‘భోగి’ అనే మాట పుట్టిందంటారు. ‘భగ’ అంటే ‘మంటలు’ లేదా ‘వేడి’ని పుట్టించడం .

కామారెడ్డి జనవరి 13 (జనంసాక్షి);
కామారెడ్డి జిల్లా వ్వాప్తంగా , స్కుల్ ,కాలెజిలు, సెలవ్ లు,రావడం తొ సంక్రాంతి పండగ హడావుడి అంతా ఒకరోజు ముందుగా వచ్చే భోగిమంటలతోనే మొదలవుతుంది. ముచ్చటైన మూడు రోజుల పెద్ద పండగలో మొట్టమొదటి సందడి భోగిది. పిల్లలకు బాగా నచ్చేదీ ఇదే! తెల్లారు జామునే లేచి.. ఊరంతా మంచుతెరలు కట్టినట్టుండే దృశ్యంలో- వణికించే చలిలో.. ఎగిసిన భోగి మంట ఒక కమనీయ అనుభూతి. ఆ మంట చుట్టూ చేరి చలి కాచుకోవడం ఓ గొప్ప అనుభవం. భోగి పండగ కేవలం సంప్రదాయ వేడుక మాత్రమే కాదు. మనసునీ, శరీరాన్నీ ఉత్తేజింపజేసే సందర్భం. ఇంకా భోగి రోజున ఆబాల గోపాలాన్ని ఆకట్టుకునే విశేషాలూ చాలానే ఉన్నాయి. మనింటి ముంగింట్లోనో, వీధిలోనో వెచ్చగా కాంతులీనే భోగి మంట సాక్షిగా చలి కాచుకుందాం రండి!సంక్రాంతి రోజుల్లో చలి ఎక్కువ. చలితో పాటు, బద్ధకం, ఇతర శారీరక రుగ్మతలూ చుట్టుముడతాయి. అప్పటికే వ్యవసాయ పనులూ దాదాపుగా పూర్తయిపోతాయి. అంతకు కొన్నిరోజుల ముందు వరకూ శ్రమించిన శరీరం విశ్రాంతిని కోరుతుంది. విశ్రాంతి ఎక్కువైతే ఉత్సాహం స్థానంలోనే బద్ధకం చోటుచేసుకుంటుంది. ఇలాంటి భావన నుంచి బయట పడడానికీ, శరీరంలో అణువణువూ వేడి రగిలించి, ఉత్సాహాన్ని నింపడానికీ భోగి పండగ జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుందని కొందరు చెబుతుంటారు. పండగ గురించి ఎన్నిరకాల కల్పిత గాథలున్నా అంతిమ లక్ష్యం జీవశక్తికి చైతన్యాన్ని అందించడమే.
***పిల్లల సంబరం
భోగి పండగలో కీలకమైన భోగి మంటలు వేయడానికి ఉత్సాహంతో ఉరకలేసేది ఎక్కువుగా పిల్లలు, కుర్రకారే. ఎక్కడెక్కడి నుంచో పాతబడిన చెక్క సామాన్లు, కలప దుంగలు సిద్ధం చేసుకుని, ముందురోజే వాటిని భోగి మంట వేయడానికి తగిన స్థలం వద్దకు చేర్చేసి, తెల్లవారు జామునే తమ పని మొదలుపెడతారు. సహజంగా ఎముకలు కొరికే చలిలోనూ ఉత్సాహంగా ఉండేది పిల్లలు, యువతే. అందువల్ల ఈ భోగి మంటలు రాజేయడమూ వారి పండగగానే ఉంటోంది. మిగిలినవారూ ఈ భోగి మంటల్లోని వెచ్చదనాన్ని ఆస్వాదించినా వారు కాస్త తెల్లారాకే ఆక్కడకొస్తుంటారు.
‘భగ’ అనే పదం నుంచి ‘భోగి’ అనే మాట పుట్టిందంటారు. ‘భగ’ అంటే ‘మంటలు’ లేదా ‘వేడి’ని పుట్టించడం అని అర్థం. దక్షిణాయనంలో ప్రజలు తాము పడిన కష్టాలను, బాధలను అగ్నికి ఆహుతి చేస్తూ రాబోయే రోజుల్లో సుఖసంతోషాలను ఇమ్మని కోరుతూ వేసే మంటలే భోగి మంటలు.
**వరికుప్పల నూర్పిడి అవగానే మిగిలిన పదార్థాలను మంటగా వేయటం వల్ల పుష్యమాస లక్షణమైన చలి తగ్గి, వాతావరణం కొంచెం వేడెక్కుతుంది. భోగి మంటలకు ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల ప్రజలు తాటాకులను ఉపయోగిస్తారు. ఈ ఆకులను భోగికి కొన్నిరోజుల ముందే కొట్టుకొచ్చి, భోగి మంటల కొరకు సిద్ధం చేసుకుంటారు. అనేక ప్రాంతాలలో ప్రత్యేకంగా భోగి మంటల కొరకు తాటాకు మోపుల్ని ఇళ్ళ వద్దకే తెచ్చి విక్రయిస్తున్నారు. మండే స్వభావమున్న పనికిరాని పాత వస్తువుల్నీ బోగిమంట కోసం సేకరిస్తారు. తెల్లవారుజామున సాధారణంగా 3 గంటల నుంచి 5 గంటల మధ్య ఈ భోగి మంటలు వేస్తారు. ఈ భోగి మంటల వద్ద చలికాచుకున్న చిన్నా పెద్దా మంటల సెగతో కాగిన వేడినీటితో తలస్నానం చేసి, కొత్తబట్టలు ధరిస్తారు. పండగ నెలలో ముగ్గులు ప్రతిరోజూ వేస్తారు. కానీ భోగి రోజు వేసే ముగ్గూ ప్రత్యేకమే.
***చిట్టి తలలపై.. భోగిపళ్ళు
భోగి రోజు సాయంత్రం పిల్లలకు భోగి పళ్లు పోస్తారు. వీటిలో ముఖ్యమైనవి రేగిపళ్లు. వీటిని సంస్కృతంలో బదరీఫలాలు అంటారు. భోగి పళ్లల్లో చామంతి, బంతి పూరేకలు, అక్షింతలు, చిల్లర నాణేలు, పాలకాయలూ కలిపి పిల్లల తలపై పోస్తారు. ఈ ప్రక్రియ వారి ఎదుగుదలకు తోడ్పడుతుందని కొంతమంది విశ్వాసం. భోగి పళ్ల పేరంటానికి వచ్చిన వారికి తాంబూలాలతో పాటు పసుపు, కుంకుమలు పెడుతుంటారు. ఈ కార్యక్రమంలో భాగంగా భోగినాడు సాయంత్రం కొంతమంది బొమ్మలకొలువూ ఏర్పాటు చేస్తారు. దీనిలో పిల్లలు తమ దగ్గర ఉన్న వివిధ రకాల బొమ్మల్ని కొత్తవాటితో జత కలిపి ప్రదర్శించి, ఆనందిస్తారు.
***కొత్తకు స్వాగతం
పాత వాటిని ఆలాగే పట్టుకుని వేలాడకుండా కొత్తని స్వాగతించాలన్నది భోగి మంటల వేడుకలో ఆంతరార్థం. పాత వస్తువులను ముఖ్యంగా చెక్కతో తయారుచేసిన వాటిని ఇలా బోగిమంటల్లో వేయడం ఆనవాయితీగా వస్తోంది. మనుషుల మీదైనా, వస్తువుల మీదైనా ఎక్కువ వ్యామోహం పనికిరాదు. అలాంటి కోర్కెలేవైనా మనసులో ఉంటే, వాటికి స్వస్తి పలకాలి. అప్పుడే జీవితం ప్రశాంతంగా ఉంటుంది. ఈ మాటను ఎవరూ వినరు. అందుకే భోగిమంట రూపంలో చెబితే వింటారన్నది పెద్దల ఆలోచన. ఇంట్లో విరిగిన కుర్చీలు, బల్లలు మొదలైన వాటిపై చాలా మందికి మితిమీరిన మమకారం. ”అది మా తాతగారిది. అదంటే నాకు సెంటిమెంటు” అని పట్టుకు వేళ్లాడుతుంటారు. అలాంటి ఆలోచనలకు స్వస్తి పలికేందుకే భోగి మంటలు వేస్తారని కొందరు చెబుతుంటారు. భోగిమంటలకూ కొన్ని నిబంధనలు ఉన్నాయి. భోగి మంటల కోసం వంట చెరకును వాడరు. కేవలం పాత సామాన్లు, దుంగలతోనే మంటల్ని వేస్తారు.
***పర్యావరణ హితంగా
భోగి మంటలూ ఇటీవలి కాలంలో దీపావళి కాలుష్యంలాగే మారుతున్నాయి. ఈ మంటల్లో కలప దుంగలు, కర్ర సామగ్రి, పేడ పిడకలు వేయడాన్ని తగ్గించి, చాలా మంది పాతటైర్లు, ప్లాస్టిక్‌ సామాన్లు, రబ్బరు వస్తువులు, ప్లాస్టిక్‌ వైర్లు, కవర్లు వంటివి వేస్తున్నారు. వీటికి అదనంగా పెట్రోలు, కిరోసిన్‌ వంటివి వేసి మరీ మంటలు పెంచుతున్నారు. ఫలితం విపరీతంగా విషవాయువులు వెలువడుతున్నాయి. ఇది పర్యావరణానికి చాలా హాని కలిగిస్తోంది. దాన్నుంచి వెలువడే కాలుష్యం చుట్టుపక్కల వారి ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి నెట్టేస్తోంది. అందుకే మనం సంప్రదాయంగా, సరదాగా వేసుకునే భోగి మంటలు పర్యావరణ హితంగా ఉండాలి. అప్పుడే పండగలోని అసలైన సందేశం నెరవేరుతుంది.