నేడు రాజ్యసభలో..  పౌరసత్వ సవరణ బిల్లు

– ఆమోదం పొందుతుందనే ధీమాతో బీజేపీ
– 123 సభ్యుల మద్దతుకై ప్రయత్నాలు
న్యూఢిల్లీ, డిసెంబర్‌10(జ‌నంసాక్షి) : వివాదాస్పద పౌరసత్వ సవరణ బిల్లు (2019)కు లోక్‌సభ ఆమోద ముద్ర వేయడంతో రాజ్యసభలో ప్రవేశపెట్టడానికి ప్రభుత్వం సమాయత్తమవుతోంది. రాజ్యసభలో ఈ బిల్లును బుధవారం ప్రవేశపెట్టనుంది. పాకిస్థాన్‌, ఆఫ్ఘనిస్థాన్‌, బంగ్లాదేశ్‌ల్లో మతపరమైన వేధింపులు ఎదుర్కొనే ముస్లిమేతరలు భారత పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకుంటే ఆమోదించడానికి ఈ బిల్లు వీలు కల్పిస్తుంది. ఈ మూడు దేశాలకు చెందిన హిందవులు, కైస్త్రవులు, పార్శీలు, జైనులు, బౌద్ధులు, సిక్కులు ఈ పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. సరైన ట్రావెల్‌ డాక్యుమెంట్లు, ఇతర పత్రాలు లేకపోయినా
వీరు 2014 డిసెంబర్‌ 31లేదా అంతకు ముందు భారత్‌కు వచ్చిఉండాలి. బిల్లుపై సోమవారం లోక్‌సభలో సుమారు 12 గంటల పాటు వాదోపవాదాలు, విమర్శలు, ఆరోపణలతో జరిగిన చర్చానంతరం అర్ధరాత్రి దాటిన తర్వాత ఓటింగ్‌ చేపట్టారు. బిల్లుకు అనుకూలంగా 311 ఓట్లు పడగా, వ్యతిరేకంగా 80 మంది ఓటేశారు. దీంతో బిల్లుకు లోక్‌సభ ఆమోదం లభించింది. కాగా ఈ బిల్లు రాజ్యసభలో సైతం ఆమోదం పొండాల్సి ఉంటుంది. బిల్లుకు ఆమోదం లభించాలంటే 245 మంది సభ్యుల రాజ్యసభలో కనీసం 123మంది సభ్యులు మద్దతివ్వాల్సి ఉంటుంది. అయితే రాజ్యసభలో మాత్రం కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం కన్పిస్తోంది. అయితే ఆర్టికల్‌ 370 రద్దు మాదిరిగానే.. ఇప్పుడు కూడా ప్రాంతీయ పార్టీల మద్దతుతో రాజ్యసభలో బిల్లును ఆమోదింపజేసుకోవాలని భాజపా యోచనలో ఉంది.
ఎగువ సభలోనూ ఆమోదం పొందుతుంది – జీవీఎల్‌ నరసింహారావు
దేశ ప్రజల హితం కోసం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ బిల్లు పెద్దల సభలోనూ ఆమోదం పొందుతుందని భాజపా రాజ్యసభ సభ్యుడు జీవీఎల్‌ నరసింహారావు విశ్వాసం వ్యక్తం చేశారు. పలు ప్రాంతీయ పార్టీలు ఈ బిల్లుకు మద్దతిస్తున్నాయని తెలిపారు. అయితే కొన్ని పార్టీలు స్థానికంగా తమ ఓటు బ్యాంకును కాపాడుకోవడం కోసం, రాజకీయ ప్రయోజనాల కోసం బిల్లును వ్యతిరేకిస్తున్నాయని విమర్శించారు. దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని తీసుకొచ్చే ప్రతి బిల్లును కాంగ్రెస్‌ వ్యతిరేకిస్తూనే ఉందని జీవీఎల్‌ ఆరోపించారు.