నేడే మంత్రి వర్గవిస్తరణ 

– ఉదయం 11.30 గంటలకు ప్రమాణ స్వీకారం
– తొమ్మిదికి తొలి జాబితాలో అవకాశం
– ఇప్పటికే పేర్లను ఖరారుచేసిన కేసీఆర్‌
– కేసీఆర్‌ను కలిసిన కొప్పుల ఈశ్వర్‌, ఎర్రబెల్లి
– ఖమ్మం, రంగారెడ్డి జిల్లాలు మలి విడతలోనే
హైదరాబాద్‌, ఫిబ్రవరి18(జ‌నంసాక్షి) : టీఆర్‌ఎస్‌ వర్గాలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తెలంగాణ కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారైంది. మంగళవారం ఉదయం 11.30 గంటలకు రాజ్‌ భవన్‌ లో నూతన మంత్రుల ప్రమాణ స్వీకారం జరుగనుంది. ఈ మేరకు కొత్త మంత్రుల జాబితా రాజ్‌ భవన్‌ కు చేరగా, ప్రమాణ స్వీకారం చేయాల్సిన వారిని గవర్నర్‌ కార్యాలయ అధికారులు ఆహ్వానిస్తున్నారు. క్యాబినెట్‌ లో 8 నుంచి 10 మందికి స్థానం లభించనున్నట్టు తెలుస్తోంది. కొత్త మంత్రుల జాబితాను సిద్ధం చేసుకున్న కేసీఆర్‌, తన కుమారుడు కేటీఆర్‌, మేనల్లుడు హరీశ్‌ రావులను ప్రస్తుతానికి దూరం పెట్టినట్టు వార్తలు వస్తున్నాయి. మంత్రుల జాబితా ఇప్పటికే లీకైంది కూడా. దీంతో మంత్రి పదవులపై ఆశలు పెట్టుకుని, గత రెండు నెలలుగా టీఆర్‌ఎస్‌ భవన్‌ చుట్టూ తిరుగుతున్న ఆశావహులు తీవ్ర నిరాశలో ఉన్నారని తెలుస్తోంది. మంత్రి వర్గంలోకి ఆదిలాబాద్‌, హైదరాబాద్‌, నిజామాబాద్‌, కరీంనగర్‌, మహబూబ్‌నగర్‌, నల్గొండ, వరంగల్‌ ఉమ్మడి జిల్లాలకు చెందిన నేతలకు ప్రాధాన్యత దక్కనున్నట్లు తెలుస్తంది. తొలి విడతలో ఖమ్మం, రంగారెడ్డి జిల్లాలకు చోటు ఉండదని తెరాస వర్గాలు పేర్కొంటున్నాయి. ఇప్పటికే  తొమ్మిది మంది పేర్లు ఖరారైనట్లు తెలుస్తోంది. మంత్రి వర్గంలో పాతవారు ఇంద్రకరణ్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, జగదీశ్‌రెడ్డి, ఈటల రాజేందర్‌లకు అవకాశం కల్పిస్తున్నట్లు సమాచారం. మరోవైపు మంత్రి వర్గంలో కొత్తవారికి కేసీఆర్‌ ప్రాధాన్యతను కల్పిస్తున్నట్లు తెలిసింది. వీరిలో వనపర్తి నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన నిరంజన్‌రెడ్డి కేసీఆర్‌కు అత్యంత సన్నిహితుడు. ఎన్నికల ప్రచార సమయంలో నిరంజన్‌రెడ్డిని గెలిపిస్తే మంత్రి పదవి ఇస్తానని కేసీఆర్‌ వనపర్తి నియోజకవర్గ ప్రజలకు హావిూ ఇచ్చారు. ఈ నేపథ్యంలో మంత్రి వర్గంలో నిరంజన్‌రెడ్డికి బెర్త్‌ ఖాయమైనట్లు తెలుస్తోంది. మరోవైపు మహబూబ్‌నగర్‌ నుంచి రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచిన శ్రీనివాస్‌గౌడ్‌కు మంత్రి వర్గంలో బెర్త్‌ ఖాయమైనట్లు సమాచారం. ఇదిలా ఉంటే కొప్పుల ఈశ్వర్‌, నిజామాబాద్‌ నుంచి వేముల ప్రశాంత్‌, వరంగల్‌ ఉమ్మడి జిల్లా నుంచి ఎర్రబెల్లి దయాకర్‌రావుకు బెర్త్‌ లు ఖరారైనట్లు తెరాస వర్గాలు పేర్కొంటున్నారు. ఈ మేరకు ఇప్పటికే కేసీఆర్‌ సమాచారం అందించినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే సోమవారం కొప్పుల ఈశ్వర్‌, ఎర్రబెల్లి దయాకర్‌రావులు సీఎం కేసీఆర్‌ను కలిసిశారు. ఈ సందర్భంగా వీరికి కేటాయించే శాఖలపైనా కేసీఆర్‌ తెలిపినట్లు సమాచారం. చివరి నిమిషంలో అనూహ్య పరిణామాలు సంభవిస్తే తప్ప ఈ జాబితాలో మార్పులుండవని తెలుస్తోంది.