నేపాల్‌కు భారత్‌ సహాయం

3

– ప్రధాని అత్యవసర భేటి

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 25 (జనంసాక్షి):

భారత ప్రభుత్వం నేపాల్‌కు  సహాయక బృందాలను పంపుతోంది. ఈ మధ్యాహ్నం 3 గంటలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఉన్నతాధికారులతో అత్యవసరంగా సమావేశమయ్యారు. ఉత్తర,  ఈశాన్య భారతంలో  సంభవించిన భూకంపం ప్రమాదాలపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్పందించారు.  భూకంప తీవ్రతపై అధికారుల నుంచి సమాచారం సేకరిస్తున్నామన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ ట్వీట్‌ చేశారు. నేపాల్లో  భూంకంప పరిస్థితిని  కూడా గమనిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. యూపీ, బీహార్‌, నేపాల్లో సంభవించిన భూకంపాలపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ  విపత్తునివారణ సంస్థను అడిగి వివరాలు తెలుసుకున్నారు.  భూకంప తీవ్రతపై అధికారులతో చర్చించారు. ఉత్తర భారతదేశంలో భారీ భూకంపం సంభవించిన నేపథ్యంలో ఉత్తరాఖండ్‌ లోని చార్‌ ధామ్‌ యాత్ర నిలిచిపోయింది. ముందు జాగ్రత్త చర్యగా అధికారులు యాత్రను నిలిపివేశారు. భూకంపం వల్ల ఉత్తరాఖండ్లోనూ భారీ నష్టం సంభవించినట్లు తెలుస్తోంది. భూకంపం కారణంగా ఎవరెస్ట్‌ పర్వతంపై మంచు చరియలు విరిగిపడ్డాయి. దీంతో 1, 2 బేస్‌ క్యాంపులు కొట్టుకుపోయాయి. పెద్ద సంఖ్యలో పర్వతారోహకులు ఎవరెస్ట్‌ పర్వతం విూద చిక్కుకుపోయారు. నేపాల్‌, ఉత్తర భారతదేశం, ఈశాన్య భారతదేశంలో వచ్చిన భూకంపం కారణంగా పలు ప్రాంతాలు అతలాకుతలమయ్యాయి. ఎవరెస్ట్‌ శిఖరాన్ని అధిరోహించేందుకు కొన్నాళ్ల ముందుగానే బయల్దేరిన పర్వతారోహకులు ఇప్పుడు అక్కడ దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారు.