నేరాల నియంత్రణకే కార్డెన్‌ సర్చ్‌

కమిషనర్‌ ఆధ్వర్యంలో తనిఖీలు
కరీంనగర్‌,జూలై25(జ‌నంసాక్షి):  నేరాల నియంత్రణ కోసమే కార్డన్‌ సెర్చ్‌ నిర్వహిస్తున్నట్లు పోలీస్‌ కమిషనర్‌  కమలాసన్‌రెడ్డి తెలిపారు. జిల్లాలోని కోతి రాంపూర్‌ హనుమాన్‌నగర్‌లో పోలీసులు నిర్భంద తనిఖీలు నిర్వహించారు. కరీంనగర్‌ పోలీస్‌ కమిషనర్‌ కమలాసన్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ తనిఖీల్లో 300 మంది పోలీసులు పాల్గొన్నారు. సరైన పత్రాలు లేని 55 ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకున్నారు. అలాగే అనుమతి లేకుండా నిల్వచేసిన మద్యాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు.  కాలనీలో సీసీ కెమెరాల ఏర్పాటుపై సీపీ స్థానికులకు అవగాహన కల్పించారు. స్థానికంగా నివాసం ఉంటున్న ముగ్గురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. ఎవరైనా చుట్టుపక్కల తెలియని వారు వస్తే పోలీసులకు వారి సమాచారం అందించాలని సీపీ సూచించారు. కాలనీలోని ఇండ్లలో తనిఖీలు చేపట్టారు. అనుమానితులను విచారించటంతో పాటు పాత నేరస్తులపై ఆరాతీశారు. నంబర్లులేని, ఎలాంటి డాక్యుమెంట్లు లేని  వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. పరిచయం లేని వారికి ఇండ్లు అద్దెకు ఇవ్వకూడదని సూచించారు. ప్రతి కాలనీలో వ్యాపార సంస్థల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సీపీ వివరించారు.