నో కట్ అండ్ పేస్ట్… ఆ టేపులు ఒరిజినలే…! ఎఫ్ ఎస్ ఎల్ నివేదిక

  ఓటుకు నోటు కేసులో కీలకమైన ఆడియో, వీడియో టేపులపై ఫోరెన్సిక్‌ సైన్స్‌ లేబొరేటరీ (ఎఫ్‌ఎస్ ఎల్‌) అధికారులు ఏసీబీ కోర్టుకు నివేదిక ఒకటి సమర్పించారు. ఆడియో, వీడియో టేపుల్లో కట్‌ అండ్‌ పేస్ట్‌ లేదు. ఒరిజినల్‌ టేపులేనని ప్రస్తుత పరిశీలనలో తేలినట్లు అందులో వివరించారని తెలిసింది. ఈ మేరకు బుధవారం సీల్డ్‌ కవర్‌లో నివేదికను న్యాయస్థానానికి అందజేశారు. 
ఓటుకు నోటు చేసులో ఏసీబీ అధికారులు టీ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డితోపాటు సెబాస్టియన్‌, ఉదయ్‌సింహాలను అరెస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో రూ.50 లక్షలతోపాటు ఆడియో, వీడియో రికార్డింగ్‌, ఐఫోన్‌, ఇతర పరికరాల్ని స్వాధీనం చేసుకుని, కోర్టుకు సమర్పించారు. వీటిలో వాస్తవికతను శాస్త్రీయంగా తేల్చాలని ఆదేశిస్తూ 14 టేపులు, ఐఫోన్‌, ఇతర పరికరాల్ని న్యాయస్థానం ఎఫ్‌ఎస్ఎల్‌కు పంపింది. టేపుల్ని దశలవారిగా పరిశీలించిన అధికారులు అందులో అతుకులు లేవని ప్రాథమికంగా నిర్ధారించారు. 
పూర్తిస్థాయి నివేదిక తయారీకి మరికొంత సమయం పడుతుంది. ఈలోగా అవసరమైతే కోర్టు అనుమతితో టేపుల్లోని వ్యక్తుల స్వర నమూనాలను నేరుగా సేకరించే అవకాశం లేకపోలేదు. బుధవారం ఎఫ్‌ఎస్ఎల్‌ ప్రాథమిక నివేదిక కోర్టుకు అందిన నేపథ్యంలో నేడో రేపో మెమో దాఖలుచేసి నివేదికను తీసుకునే అవకాశం ఉంది.