పంచాంగకర్త నృసింహరామ సిద్దాంతి కన్నుమూత

వరంగల్‌ రూరల్‌,ఆగస్ట్‌9(జ‌నం సాక్షి): ప్రముఖ జ్యోతిష్య పండితుడు, పంచాంగకర్త బ్రహ్మశ్రీ పాలకుర్తి నృసింహరామ సిద్దాంతి గురువారం ఉదయం కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఈ ఉదయం కొడకండ్లలోని తన స్వగృహంలో శివైక్యం చెందారు. కొడకండ్ల సిద్దాంతిగా ఆయనకు తెలుగు రాష్టాల్లో మంచి పేరు ఉంది. గతంలో రవీంద్ర భారతిలో ఆయనకు సన్మానం కూడా జరిగింది. ఈ సన్మాన సమయంలో ఆయనకు ‘ ధార్మిక వరేణ్య ‘ బిరుదును ఇచ్చారు. తెలంగాణసిఎం కెసిఆర్‌ ఆయనకు స్వర్ణ కంకణాన్ని తొడిగారు. అనంతరం ఆయన్ను పల్లకిలో ఊరేగించారు. ఈ పల్లకిని స్వయంగా కెసిఆర్‌ మోశారు. కెసిఆర్‌ నిర్వహించిన అయుత చండీయాగం కూడా కొడకండ్ల సిద్దాంతి చేతుల విూదుగానే జరిగింది. కొడకండ్ల సిద్దాంతి మృతిపై పలువురు రాజకీయ ప్రముఖులు, వేద పండితులు సంతాపం తెలిపారు.

———–